వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకుని ఆమెను జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు. షర్మిల అరెస్ట్ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇంటి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారులో బయటకు వెళుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారును ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వైఎస్ షర్మిల.. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా కాసేపు రోడ్డుపై షర్మిల బైఠాయించారు. రోడ్డు మీద నుంచి లేమని సర్ది చెప్పడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులను తోసేసుకుంటూ బయటకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేశారు. దీంతో కాసేపు షర్మిల ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. షర్మిల అరెస్ట్ నేపథ్యంలో లోటస్ పాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారుల తీరుపై షర్మిల మండిపడ్డారు. సొంత పనులకు బయటకు రాకుండా అడ్డుకుంటారా? అంటూ ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ విధంగా తనను తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. గతంలో కూడా అనేకసార్లు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని, పలుమార్లు అరెస్ట్ చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.