top of page
MediaFx

వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం.. వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం


ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. పార్టీలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కొత్తగా ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు. గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ( రాయచోటి), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి), వేంపల్లి సతీశ్‌రెడ్డి(పులివెందుల)ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పార్టీని సమన్వయం చేసే బాధ్యతలను వీరికి అప్పగించే అవకాశం ఉంది. అలాగే వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా జక్కంపూడి రాజాను నియమించారు. వైసీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా సుధాకర్‌ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు.

వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆళ్ల నాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు వైఎస్‌ జగన్‌ బాధ్యతలు అప్పగించారు. అలాగే దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ వ్యవహారం ఇటీవల దుమారం రేపిన నేపథ్యంలో ఆయన్ను టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. ఆ నియోజకవర్గ బాధ్యతలను పార్టీ సీనియర్‌ నేత పేరాడ తిలక్‌కు అప్పగించారు.


bottom of page