top of page
Suresh D

కృత్రిమ మేధ తో 40 శాతం ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం

కృత్రిమ మేథ ప్రపంచవ్యాప్తంగా 40% ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) అధ్యయనంలో తేలింది.

చాలా రకాలైన ఉద్యోగాలను కృత్రిమ మేధ కనుమరుగు చేస్తుందన్న వార్తలకు బలం చేకూరుస్తూ ఐఎంఎఫ్ తాజా నివేదిక వెలువడింది. కృత్రిమ మేధ తో ఆదాయ అసమానతలు పెరిగే ముప్పు ఉందని పేర్కొంది.

ఐఎంఎఫ్ విశ్లేషణ

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) విశ్లేషణ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు కృత్రిమ మేధస్సు (artificial intelligence AI) ద్వారా ప్రభావితమవుతాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, తక్కువ ఆదాయ దేశాల కంటే.. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలపైనే కృత్రిమ మేధ ప్రభావం అధికంగా ఉంటుంది. కృత్రిమ మేధ ప్రతికూల ప్రభావాలపై ఐఎంఎఫ్ (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా ఒక బ్లాగ్ పోస్ట్ లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో, ప్రపంచ వ్యాప్తంగా ఆదాయ, సామాజిక అసమానతలు ఏఐ (AI) కారణంగా మరింత దిగజారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో సమాజంలో ఉద్రిక్తతలు ప్రబలడానికి ముందే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వాలు సమగ్ర సామాజిక భద్రతా పథకాలను ప్రారంభించాలన్నారు. ఏఐతో ప్రభావితమయ్యే అవకాశమున్న కార్మిక వర్గాలకు రీట్రైనింగ్ కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence AI) కొన్ని ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేసే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో కృత్రిమ మేథ 60 శాతం ఉద్యోగాలపై ప్రభావం చూపుతుంది. అభివృద్ధి చెందుతున్న, తక్కువ ఆదాయ దేశాలపై దీని ప్రభావం కొంత తక్కువగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో, కృత్రిమ మేథ అనుకూల, వ్యతిరేక వాదనలు పెరుగుతున్న నేపథ్యంలో, పలు అంతర్జాతీయ వేదికలపై దీనిపై లోతైన చర్చలు జరుగుతున్నాయి.
ఉద్యోగాలు పోతున్నాయి..

బజ్ ఫీడ్ సంస్థ తన కంటెంట్ క్రియేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకునే దిశగా ప్రణాళికలను ప్రకటించింది. ఈ ప్రణాళిక వల్ల ఆ సంస్థలోని ప్రధాన వార్తా విభాగం మూత పడింది. అలాగే, 100 మందికి పైగా సిబ్బందిని తొలగించారు. డిసెంబర్ లో యూరోపియన్ యూనియన్ కృత్రిమ మేధకు రక్షణ కల్పించే చట్టంపై తాత్కాలిక ఒప్పందానికి వచ్చింది. ఇదిలావుండగా, కృత్రిమ మేధస్సుపై అమెరికా ఫెడరల్ రెగ్యులేటరీ వైఖరిని ఇంకా అంచనా వేస్తోంది.

bottom of page