ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించి మెప్పించిన నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే తెలియకుండానే నవ్వు వచ్చేది. చిన్న హీరోల సినిమా దగ్గర నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు నటించి తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాటకాల నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అంతే కాదు ఆయన ఓ మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.. సినిమాల్లోకి రాకముందు ఆయన చాలా వాణిజ్యప్రకటనలకు తన వాయిస్ ఇచ్చారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అలాగే వ్యవసాయ కార్యక్రమాలకు కూడా వాయిస్ ఇచ్చారు ధర్మవరకు.. దాదాపు 150, 200ల కార్యక్రమాలకు ధర్మవరపు తన వాయిస్ అందించారు. ఆ తర్వాత సీరియల్స్ లోకి అడుగుపెట్టారు. ఇక ఆనందో బ్రహ్మ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ దిగ్గజ నటుడు. ఒక్కడు సినిమాలో చేసిన పాస్‌పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 2013 డిసెంబరు 7 న అనారోగ్య కారణాలతో కన్నుమూశారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఇక హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు మధ్య మంచి అనుబంధం ఉండేది. ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. ధర్మవరపు చనిపోయిన తర్వాత బ్రహ్మానందం చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన గురించి మాట్లాడుతూ.. ధర్మవరం ను నేను ధర్మన్న అని పిలిచేవాడిని.. చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి మాట్లాడాడు.. ఫోన్ చేసి నాది ఒక చిన్న రిక్వెస్ట్ రా.. నువ్వు నన్ను చూడటానికి రావొద్దురా.. నువ్వు నన్ను చూడలేవు. ఇంతకుముందు నువ్వు చూసినట్టు నేను ఇప్పుడు లేను.. నా పరిస్థితి బాలేదు. నీ గుర్తుల్లో నేను ఎలా ఉన్నానో అలానే ఉండాలి రావొద్దు రా అన్నాడు. నేను రోజూ ప్రయత్నించేవాడిని వెళ్లి చూడాలని కానీ వొద్దు అని నన్ను ఆపే వాడు. కాదు కాదు నేను వస్తాను అని పట్టు పడితే.. డిసెంబర్ నెలలో వద్దువుగాని రా.. అప్పటికి నేను కోలుకుంటాను.. బాగుంటాను.. ఇంతకు ముందులా యాక్టివ్ గా ఉంటాను అన్నాడు. అలాగే నీకోసం ఓ పద్యం పడతాను అని ఓ పద్యం పాడాడు.. నేను త్వరగానే వచ్చేస్తా.. మనం అందరం మళ్లీ కలిసి నటిద్దాం అని చెప్పారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రహ్మానందం.