top of page
MediaFx

నువ్వు మా చాంపియన్‌వి..


భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ ‘అనర్హత వేటు’పై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(కాస్‌)లో తీర్పు దేశ ప్రజలను నిరాశకు గురిచేసినా క్రీడాలోకం మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచింది. పతకం రాకపోయినా ఆమె చాంపియన్‌ అని కొనియాడింది. వినేశ్‌ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న కాస్‌.. ఈనెల 16న తీర్పు వెలువరించాల్సి ఉన్నా 14వ తేదీ రాత్రి ఉన్నఫళంగా ఆమె పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు ప్రకటించడం భారత క్రీడాభిమానులను నివ్వెరపోయేలా చేసింది. కారణాలేమీ చెప్పకుండానే ‘సింగిల్‌ లైన్‌ ఆర్డర్‌’తో కాస్‌ వెలువరించిన ప్రకటన అనంతరం ఆమెకు పలువురు క్రీడాకారులు మద్దతుగా నిలిచారు. హాకీ దిగ్గజం శ్రీజేష్‌, జర్మన్‌ప్రీత్‌, అమిత్‌ రోహిదాస్‌, రెజ్లర్‌ బజరంగ్‌ పునియా, మాజీ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌, జాతీయ రెజ్లింగ్‌ కోచ్‌ విజయ్‌ దహియా వినేశ్‌కు అండగా నిలిచారు.

‘నీకు దక్కాల్సిన పతకాన్ని చీకట్లో లాగేసుకున్నారు. కానీ నువ్వు ఈరోజు ప్రపంచం ఎదుట కోహీనూర్‌ వజ్రంలా ప్రకాశిస్తున్నావు’ అని ఎక్స్‌ వేదికగా పునియా రాసుకొచ్చాడు. ‘ఇది చాలా బాధాకరం. అత్యుత్తమంగా పోరాడి ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు సదరు క్రీడాకారులు ఎలా బాధపడతారో మేం అర్థం చేసుకోగలం. కానీ నువ్వు మాత్రం మాకు ఎప్పటికీ చాంపియన్‌వే’ అని జర్మన్‌ప్రీత్‌ అన్నాడు.

‘దేశం మొత్తం ఆమెకు అండగా ఉంది’ అని రోహిదాస్‌ చెప్పాడు. విజయ్‌ దహియా స్పందిస్తూ.. ‘తీర్పు మాకు అనుకూలంగా వస్తుందనుకున్నాం. కానీ దురుదృష్టవశాత్తూ వినేశ్‌ పిటిషన్‌ను కాస్‌ కొట్టేసింది. ఆమె పోటీలోకి దిగితే స్వర్ణం గెలిచేది. కనీసం రజతం అయినా వస్తుందని ఆశించినా కాస్‌లోనూ నిరాశే ఎదురైంది. ఇది తీవ్ర అన్యాయం’ అని అన్నాడు. ‘తీర్పు చాలా బాధాకరం. మేం వినేశ్‌కు అండగా నిలబడుతున్నాం. ఆమెకు ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుంది’ అని విజేందర్‌ తెలిపాడు.

కాస్‌ తీర్పు నేపథ్యంలో వినేశ్‌ ఫోగాట్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌గా మారింది. పారిస్‌ ఒలింపిక్స్‌ బౌట్‌లో మ్యాట్‌పై పడుకొని కన్నీటితో బాధపడుతున్న ఫొటోను పోస్ట్‌ చేసింది. దీనికి ప్రముఖ పంజాబీ సింగర్‌ ‘బీ ప్రాక్‌’ పాడిన ‘రబ్బా వే’ పాటను జత చేసింది. ఒలింపిక్‌ పతకం విషయంలో తన దురదృష్టాన్ని సూచిస్తూ ఫోగాట్‌ ఈ పోస్ట్‌ చేసినట్లు తెలుస్తున్నది.




bottom of page