ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతోంది. అయితే.. కొన్ని సందర్భాల్లో మంచి జరుగుతున్నా.. కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అవుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ కేసులతో జైళ్ల పాలవుతున్న పరిస్థితులు దర్శనిమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తప్పుడు సమాచారానికి.. ఇష్టరీతి పోస్టులకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
సోషల్ మీడియాలో తప్పుడు కంటెంట్‌ను ప్రచారం చేసేవారి ఆట కట్టించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్. యూపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ సరికొత్త సోషల్ మీడియా పాలసీకి యోగీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టేవారిపై కొరడా ఝుళిపించబోతోంది. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారికి కఠిన శిక్షలు విధించేందుకు రెడీ అవుతోంది. ప్రధానంగా.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగం వల్ల జరిగిన నష్టాలను చట్టపరంగా పరిష్కరించేందుకు కూడా ఈ కొత్త పాలసీ ఉపయోగపడుతుందని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా.. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై తీవ్రతను బట్టి కనీసం మూడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది.