ఏ దర్శకుడైనా ఒక హీరోను టార్గెట్ చేస్తాడు.. లేదంటే ఇద్దర్ని టార్గెట్ చేస్తాడు. కానీ ఇండస్ట్రీలో ఓ దర్శకుడు మాత్రం టాప్ హీరోలందరినీ టార్గెట్ చేస్తున్నాడు. మొన్న మహేష్.. నిన్న బన్నీ.. తాజాగా తారక్.. ఇలా సాగుతుంది ఆయన జర్నీ. మరోవైపు ప్రభాస్ సినిమా ఆల్రెడీ లాక్ అయిపోయింది. ఈ రేంజ్లో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న ఆ దర్శకుడెవరు..?
సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చేసింది రెండు సినిమాలే కానీ.. వచ్చిన పేరు మాత్రం ఆకాశమంత. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కు ఇంకా సందీప్ సినిమాలు ఎక్కలేదు. అయినా కూడా ఈయన దూకుడు మాత్రం మామూలుగా లేదు. యానిమల్ సక్సెస్ తర్వాత.. ప్రస్తుతం ప్రభాస్ కోసం కథ సిద్ధం చేస్తున్నారీయన.
అర్జున్ రెడ్డితోనే అరాచకం చేసిన సందీప్.. యానిమల్తో అద్భుతాలు చేసి చూపించారు. రణ్‌బీర్ కపూర్ కెరీర్ డౌన్లో వచ్చిన సమయంలో వచ్చిన యానిమల్.. ఏకంగా 900 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. హను రాఘవపూడి సినిమా తర్వాత స్పిరిట్‌తో బిజీ కానున్నారు ప్రభాస్. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నారు.
టాలీవుడ్ టాప్ హీరోలందర్నీ ఒకేసారి కవర్ చేస్తున్నారు సందీప్. స్పిరిట్ ఇంకా సెట్స్‌పైకి రాకముందే.. అల్లు అర్జున్ సినిమాను కన్ఫర్మ్ చేసారు సందీప్. ఆ మధ్య ఈ కాంబినేషన్‌పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. పుష్ప తర్వాత ఓ సినిమా చేసుకుని.. ఆ తర్వాత వంగా సినిమాపై కాన్సట్రేట్ చేయనున్నారు అల్లు అర్జున్.
ప్రభాస్, బన్నీ సినిమాలతో పాటు ఆ మధ్య మహేష్ బాబుతోనూ సినిమా ఉంటుందని చెప్పారు సందీప్. ఈ విషయాన్ని సూపర్ స్టార్ కూడా కన్ఫర్మ్ చేసారు.. యానిమల్ ప్రీ రిలీజ్‌కు కూడా వచ్చారు. తాజాగా ఎన్టీఆర్‌తో ఫోటో అప్లోడ్ చేసారు ఈ దర్శకుడు. దేవర కోసం ముంబైలో ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేయనున్నారు సందీప్. ఈ లెక్కన తారక్‌ను కూడా టార్గెట్ చేసినట్లే.