ఇటీవలి కాలంలో బంగారం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఫలితంగా యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించాలన్న కేసీఆర్ కోరిక నెరవేరడం ఆలస్యం అవుతోంది.
బంగారం ధరలు పెరగడానికి.. కేసీఆర్ కోరిక ఆలస్యం కావడానికి సంబంధం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? కేసీఆర్ సర్కారు యాదాద్రి ఆలయాన్ని అత్యద్భుతంగా పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. చరిత్రలో నిలిచిపోయేలా.. గత ఏడాది మార్చి చివర్లో ఈ ఆలయాన్ని పునః ప్రారంభించగా.. అప్పటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి తరలి వెళ్తున్నారు. యాదాద్రి ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత.. తిరుమల తరహాలో గర్భగుడిపై ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని కేసీఆర్ భావించారు. 56 అడుగుల ఎత్తయిన ఈ విమాన గోపురానికి బంగారంతో తాపడం చేయించడం కోసం కేసీఆర్ తనవంతుగా ఒక కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. గత ఏడాది కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన కేసీఆర్.. బంగారం కొనుగోలు కోసం చెక్‌ను అందజేశారు. ఈ క్రతువులో భక్తులంతా భాగం కావాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. దీంతో పలువురు రాజకీయ నాయకులతోపాటు సామాన్య ప్రజలు సైతం విరాళాలు ప్రకటించారు. మేఘా సంస్థ 6 కిలోలు, హెటిరో గ్రూప్ అధినేత పార్థసారథి రెడ్డి 5 కిలోల బంగారాన్ని యాదాద్రీశుడికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి 125 కిలోల స్వచ్ఛమైన బంగారం అవసరమని.. ఈ బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ నుంచి కొనుగోలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ‘ఆలయానికి స్వర్ణ తాపడం కోసం 800 కిలోల బంగారం అవసరమని.. ప్రస్తుతం తమ వద్ద 400 కిలోల బంగారం ఉందని స్థపతులు తెలిపార’ని యాదాద్రి ఆలయ సీనియర్ అధికారి వెల్లడించారు. కేసీఆర్ పిలుపునకు మొదట్లో స్పందన బాగానే వచ్చినప్పటికీ.. పసిడి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో.. విరాళం రూపంలో బంగారం రావడం ఆగిపోయింది. విరాళాలు ప్రకటించినవారు సైతం బంగారాన్ని ఆలయానికి అందజేయలేకపోయారు. ఫలితంగా తాపడం పనులు ఆలస్యమయ్యే పరిస్థితి తలెత్తింది. దీంతో తామే బంగారాన్ని కొనుగోలు చేసి తాపడం చేయిస్తామని.. నెల రోజుల్లో స్వర్ణ తాపడం పనులు మొదలుపెడతామని ఆలయ అధికారులు చెబుతున్నారు.స్వర్ణ తాపడానికి ముందు యాదాద్రి ఆలయానికి రాగి తొడుగులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది జనవరిలో గోపురం రాగి తాపడం పనులు మొదలుకాగా.. తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన రవీంద్రన్ స్థపతి సారథ్యంలోని 45 మంది తాపడం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ పనులు నెల రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆలయానికి రాగి తాపడం కోసం భారీ మొత్తంలో రాగిని వినియోగిస్తున్నారు. బంగారం తాపడం కూడా పూర్తయితే.. వందేళ్లపాటు యాదాద్రి ఆలయ గోపురం స్వర్ణకాంతులతో మెరిసిపోనుంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదివారం కిలో బంగారాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చారు. ఇలాగే భక్తులు ముందుకొచ్చి బంగారాన్ని విరాళంగా అందజేస్తే.. త్వరలోనే స్వర్ణ తాపడం పనులు మొదలవుతాయి.