top of page
Suresh D

కాంగ్రెస్‌ కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే కాంగ్రెస్‌కు షాక్ ఇస్తారా?🤔 👥

ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్క సారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు తనదైన శైలిలో రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో తిప్పిన కేసీఆర్ కు ఈ ఎన్నికల ఫలితాలు ఓ షాకింగ్ అనే చెప్పాలి. మూడో సారి హ్యట్రిక్ కొడదామన్న ఆశలకు తెలంగాణ ఓటర్లు గండి కొట్టారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్క సారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు తనదైన శైలిలో రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో తిప్పిన కేసీఆర్ కు ఈ ఎన్నికల ఫలితాలు ఓ షాకింగ్ అనే చెప్పాలి. మూడో సారి హ్యట్రిక్ కొడదామన్న ఆశలకు తెలంగాణ ఓటర్లు గండి కొట్టారు. 39 మంది ఎమ్మెల్యేను మాత్రమే బీఆర్ఎస్ నుండి అసెంబ్లీకి పంపి అధికార పక్షం నుండి దింపి ప్రతిపక్ష పాత్ర పోషించాలని డిసైడ్ చేశారు. అయితే కాంగ్రెస్ కు కూడా పెద్ద మెజార్టీ ఇవ్వలేదు. మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాగా మిత్రపక్షం సీపీఐ పార్టీతో కలుపుకుని కేవలం 5 సీట్లు మాత్రమే అధికంగా ఇచ్చారు. 65 సీట్లతోనే అధికారం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆరేడు సీట్లు అటు ఇటు మారితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అది ఎసరుగా మారనుంది.

అయితే సమకాలీన రాజకీయాల్లో కేసీఆర్ రాజకీయ వ్యూహ చతురత అందరికీ తెలిసిందే. ఏ మాత్రం అవకాశం ఉన్నా అధికార పక్షానికి ఇబ్బందులు సృష్టించగలరన్న భావనలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. తెలంగాణలో మాత్రం గెలిచింది. ఈ తరుణంలో ఐదేళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా పరిపాలించాలంటే సుస్థిరమైన రాజకీయ వాతావరణ అవసరం. ఇందు కోసం 2014, 2018 ఎన్నికల వరకు కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే కాంగ్రెస్ అనుసరిస్తుందా అన్న చర్చ సర్వత్రాసాగుతోంది.

2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) 119 సీట్లకు గాను 63 సీట్లు గెల్చుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో,టీడీపీ 15 స్థానాల్లో గెలుపొందింది. మిత్రపక్షం ఎం.ఐ.ఎం 7 స్థానాల్లో గెలిచి బీఆర్ఎస్ కు మద్ధతునిచ్చింది. అయితే ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్న సమాచారం ఎం.ఐ.ఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ తనకు ఇచ్చారని చెబుతూ కేసీఆర్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీల నుండి ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చీల్చి తన పార్టీలో విలీనం చేసుకున్నారు. 2018లో 88 సీట్లలో బీఆర్ఎస్ గెలిచి ప్రభుత్వాన్ని ఎర్పాటు చేసింది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లలో, టీడీపీ 2 స్థానాల్లో, ఎం.ఐ.ఎం 7 స్థానాల్లో బీజేపీ 1 స్థానంలో గెలిచింది. ఆఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలను కొందరిని తన పార్టీలో కలుపుకుంది.

దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షమన్నదే లేని పరిస్థితి ఉంది. ఎక్కువ సీట్లు పొందిన మిత్రపక్షం ఎం.ఐ.ఎం నే ప్రతిపక్షంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో కేవలం 65 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే సీఎం అభ్యర్థి అన్న విషయంలో పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగినా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలోఈ పరిణామాలు తిరిగి తలెత్తవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కు సానుకూలంగా ఉండే నేతలు ఉన్నారని అలాంటి వారు పార్టీలో ఎమ్మెల్యేల మద్ధతు కూడగడితే, బీఆర్ఎస్ ,ఎం.ఐ.ఎంలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొట్టిపారేయలేని విషయమని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా చెతులు కట్టుకోని కూర్చోదని, నీవు నేర్పినే విద్యనే నీరజాక్ష అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ గా ఉన్న సమయంలోను, ఆ తర్వాత అధికారంలో ఉన్న సమయంలోను టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండే ఎక్కువ సంఖ్యలో నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంది. ఆ నేతలతో ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్యనేతలతో పరిచయాలున్నాయి. రేవంత్ రెడ్డికి పాత టీడీపీ నేతలతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందులో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి నేతలను కాంగ్రెస్ తన వైపు తిప్పుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 65 మంది సభ్యులతో ప్రభుత్వం నడపడం కత్తిమీద సామేనని, ఏ మాత్రం కాంగ్రెస్ లో అసంతృప్తి మొదలయితే ఆ పరిస్థితిని కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోగల ఉద్ధండుడని హస్తం నేతలకు తెలుసు. ఈ క్రమంలో కేసీఆర్ కు ఆ అవకాశం ఇవ్వకూడదనుకుంటే 39 మంది సభ్యుల్లో కలిసి రాగల నేతలను సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగించి లాక్కునే అవకాశాలున్నయని చెబుతున్నారు. ఈ క్రమంలో భూవివాదాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, కేసుల్లో ఉన్న వారిని, వ్యాపారాలు చేస్తోన్న ఎమ్మెల్యేలు టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ ఉండవచ్చని చెబుతున్నారు.

ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నీ సానుకూలంగానే ఉంటాయి. అధికార దండంతో ఏదైనా చేయవచ్చు. కాని ప్రతిపక్షంలో ఉండి పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కత్తి మీద సామే. ఇప్పుడు కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు వేసే ఎరను ఎలా అడ్డుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. కొద్ది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. ఆ ఎమ్మెల్యేలను ఉద్యమ ద్రోహులుగా ముద్ర వేసి అప్పటి టీఆర్ఎస్ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఇటీవలే బీజేపీ నుంచి అదే తరహాలో ప్రయత్నం జరిగితే ఆ బేర సార దృశ్యాలను మీడియాకు విడుదల చేసి, పోలీసు కేసులు పెట్టి ఆ ప్రయత్నాలను భగ్నం చేసింది.

అయితే ఎమ్మెల్యేల ఎర కేసుతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు వాదించడం కూడా జరిగింది. అయితే ఈ దఫా బీఆర్ఎస్ అధికార పక్షం నుండి ప్రతిపక్షంగా మారిన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలకు వేసే ఎరను కేసీఆర్ ఎలా అడ్డుకుంటారన్నది వేచి చూడాలి. ఎప్పుడూ ఎదురుదాడికి దిగే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తీసుకుంటారా..లేక కాంగ్రెస్ కే షాక్ ఇస్తారా.. అన్నది మాత్రం రానున్న రోజుల్లో తేలనుంది. 🤔 👥

bottom of page