top of page

హత్యాచారం జరిగిన రోజు రాత్రి దాకా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదు..? బెంగాల్‌ సర్కారుపై సుప్రీం మండిపాటు


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకొన్న సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం, కోల్‌కతా పోలీసులు, ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపాల్‌కు ప్రశ్నల వర్షం కురిపించింది. ట్రైనీ డాక్టర్‌ హత్యాచారాన్ని భయానక ఘటనగా పేర్కొన్న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో అంత ఆలస్యం ఎందుకు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ‘పోస్టుమార్టం పూర్తయిన తర్వాత, మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన తర్వాత రాత్రి సమయంలో ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? కోల్‌కతా పోలీసులు, దవాఖాన అధికారులు అప్పటి వరకు ఏం చేస్తున్నారు? కూతురి మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులు గంటలపాటు వేచిచూసేలా ఎందుకు చేశారు?’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. పోలీసులు ఏం చేస్తున్నారు?

ప్రభుత్వ దవాఖానపై వందల మంది దుండగులు దాడి చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విధ్వంసకారులపై తీసుకొన్న చర్యలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దవాఖానపై జరిగిన మూకదాడి, ఘటనాస్థలి నుంచి పోలీసులు పారిపోయారన్న ఆరోపణలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. క్రైమ్‌ సీన్‌ ఉన్న దవాఖానపై దాడి, విధ్వంసం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించింది. వైద్యులు విధుల్లోకి తిరిగి వెళ్లేలా దవాఖాన వద్ద సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించాలని ఆదేశించింది. అదేవిధంగా కేసు దర్యాప్తులో పురోగతిపై స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది.

ఆందోళనలపై సున్నితంగా వ్యవహరించాలి

హత్యాచార ఘటనను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై అధికారం చెలాయించొద్దని, దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో సున్నితంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. ‘డాక్టర్లు, పౌర సమాజాన్ని అడ్డుకోవడం సరికాదు. క్రైమ్‌ సీన్‌ను రక్షించాల్సిన, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’ అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది.

ప్రిన్సిపాల్‌కు ప్రశ్నల వర్షం

కేసు విచారణ సందర్భంగా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ వ్యవహారశైలిని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కేసును ఆత్మహత్యగా చెప్పేందుకు ప్రయత్నించారని, కుమార్తె మృతదేహాన్ని చూడనీయకుండా బాధిత తల్లిదండ్రులను గంటల పాటు వేచిచూసేలా చేశారని విమర్శించింది. ‘ప్రిన్సిపాల్‌ ఏం చేస్తున్నారు? మొదట ఆత్మహత్యగా చెప్పే ప్రయత్నం చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఎందుకు నిష్క్రియతో ఉన్నారు? మృతదేహాన్ని కూడా అంత్యక్రియల కోసం ఆమె తల్లిదండ్రులకు రాత్రి సమయంలో అప్పగించారు’ అని అసహనం వ్యక్తం చేసింది. ప్రిన్సిపాల్‌పై దర్యాప్తు జరుగుతుండగానే రాజీనామా తర్వాత అయన్ను వెంటనే మరో కాలేజీకి ఎలా నియమిస్తారు? అని ప్రశ్నించింది.

పోలీసులు తగిన చర్యలు తీసుకొన్నారు: సిబల్‌

కోర్టు పరిశీలనలను పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ తిరస్కరించారు. కోల్‌కతా పోలీసులు తగిన చర్యలు తీసుకొన్నారని, వాస్తవాలను తాను కోర్టు ముందు ఉంచుతానని వాదించారు. పోలీసులు క్రైమ్‌ సీన్‌కు చేరుకోకముందే ఫొటోలు, వీడియోలు సర్క్యులేట్‌ అయ్యాయన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు వెంటనే అసహజ మృతిగా రిజిస్టర్‌ చేశారని వెల్లడించారు. పోలీసులు వెంటనే నిందితుడ్ని అరెస్టు చేశారని తెలిపారు. ఫొటోలు, వీడియోలు వెంటనే తొలగించండి

బాధిత ట్రైనీ డాక్టర్‌ పేరు, ఫొటోలు, వీడియోలను అన్ని సోషల్‌ మీడియా వేదికల నుంచి వెంటనే తొలగించాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. లైంగిక దాడి బాధితురాలి గుర్తింపును బయటపెట్టడం నిపున్‌ సక్సేనా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నది. ఈ మేరకు లాయర్‌ కిన్నోరి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.

మాపై విశ్వాసం ఉంచి.. విధుల్లో చేరండి

‘మాపై విశ్వాసం ఉంచి, వెంటనే విధుల్లో చేరండి’ అని కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న వైద్యులకు సుప్రీంకోర్టు సూచించింది. సమ్మె విరమించి, విధులకు హాజరు కావాలని కోరింది. వైద్యులు విధులకు దూరంగా ఉండటం వలన ఆరోగ్య రక్షణ అవసరమైన సమాజంపై ప్రభావం పడుతుందని పేర్కొన్నది. వైద్య సిబ్బందికి భద్రత, రక్షణ కల్పించేందుకు తాము ఇక్కడ ఉన్నామని స్పష్టం చేసింది. వైద్య సిబ్బందికి భద్రత కల్పించే అంశంపై కోర్టు జోక్యం చేసుకోవడాన్ని ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ స్వాగతించింది. దేశవ్యాప్తంగా విధులకు దూరంగా ఉన్న వైద్యులను వెంటనే విధులను కొనసాగించాలని కోరుతామని పేర్కొన్నది.

సురక్షిత పని పరిస్థితులు లేకపోవడంపై ఆందోళన

దేశవ్యాప్తంగా ప్రధానంగా ప్రభుత్వ దవాఖానల్లో సురక్షిత పని పరిస్థితులు లేకపోవడంపై బెంచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. పలు చోట్ల వైద్యులపై దాడులు జరుగుతున్న అంశాన్ని ప్రస్తావించిన కోర్టు.. ఇవి వైద్య సిబ్బందికి రక్షణ కల్పించడంలో నిర్మాణాత్మక వైఫల్యానికి ఉదాహరణలు అని పేర్కొన్నది. చాలా మంది యువ వైద్యులు వరుసగా 36 గంటల పాటు పనిచేస్తున్నారని, వారికి డ్యూటీ రూమ్‌లు లేకపోవడాన్ని గుర్తించామని, అదేవిధంగా పురుష, స్త్రీ డాక్టర్లు, నర్సులకు వేర్వేరు రెస్ట్‌రూమ్‌లు లేవని పేర్కొన్నది. ఒక మహిళ తన పని ప్రదేశానికి సురక్షితంగా వెళ్లలేకుంటే, మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్టేనని కోర్టు అభిప్రాయపడింది. క్షేత్రస్థాయిలో మార్పులు జరిగేందుకు మరో అత్యాచారమో లేదా హత్యనో జరిగేంత వరకు వేచి చూడొద్దు అని పేర్కొన్నది. దీని కోసం పని ప్రదేశాల్లో వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి భద్రత కల్పించేందుకు ఒక జాతీయ ప్రొటోకాల్‌ను రూపొందించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు.. అందుకు సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆర్తి శరన్‌ నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన ఒక నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎన్‌టీఎఫ్‌)ను ఏర్పాటు చేసింది. మూడు వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని సూచించింది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page