top of page
MediaFx

గాంధీజీని జాతిపిత అని మొదటిసారిగా పిలిచింది ఎవరో తెలుసా..!


మహాత్మాగాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సాధారణ కుటుంబంలో జన్మించారు. అహింసనే ఆయుధంగా చేసుకుని యావత్ ప్రపంచం ఆలోచనలను మార్చేశాడు. గాంధీజీ ప్రారంభించిన స్వేచ్ఛ, శాంతి కార్యక్రమాలు భారతదేశం, దక్షిణాఫ్రికాలో అనేక చారిత్రక ఉద్యమాలకు కొత్త దిశను నిర్దేశించాయి. గాంధీ మొదటి సత్యాగ్రహం 1917లో బీహార్‌లోని చంపారన్ జిల్లాలో మొదలు పెట్టారు. అప్పటి నుండి మహాత్మా గాంధీ భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారారు.

మహాత్మా గాంధీని జాతిపిత అని ఎవరు పిలిచారంటే?

మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మహాత్మాగాంధీని జాతిపిత అని పిలిచే మొదటి వ్యక్తి అని సాధారణ అభిప్రాయంగా వినిపిస్తుంది. అయితే నివేదిక ప్రకారం గాంధీజీ మరణానంతరం, అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ రేడియో ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘జాతికి తండ్రి ఇక లేరు’ అని చెప్పారు. అయితే ఆయన కంటే ముందే మరో కాంగ్రెస్ నాయకుడు మహాత్మా గాంధీని ‘జాతి పితామహుడు’ అని పిలిచారు. అతనే భరత మాత ముద్దు బిడ్డ సుభాష్ చంద్రబోస్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేతాజీ బోస్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడానికి పరోక్షంగానైనా సరే ప్రధాన కారణం మహాత్మా గాంధీ. విభేదాలు ఉన్నప్పటికీ జాతి పితామహుడిగా పరిగణించిన సుభాష్

గాంధీజీని సుభాష్ బోస్ చాలా గౌరవించేవారు. అయితే సుభాష్ చంద్ర బోస్ కు గాంధీజీ కోరిక అంతిమ నిర్ణయం కాదు. 1940లో కాంగ్రెస్‌ పథకాలకు దూరంగా పనిచేస్తున్న సుభాష్‌ ను అరెస్టు చేశారు. గాంధీజీ 1940 జూలై 9న సేవాగ్రామ్‌లో ‘సుభాష్‌ వంటి గొప్ప వ్యక్తిని అరెస్టు చేయడం సామాన్యమైన విషయం కాదు.. అయితే సుభాష్‌ తన పోరాటాన్ని ఎంతో అవగాహనతో, ధైర్యంగా ప్లాన్ చేసుకున్నారు’ అని అన్నారు.

బ్రిటిష్ వారి బారి నుండి తప్పించుకుని సుభాష్ చంద్రబోస్ జూలై 1943లో జర్మనీ నుంచి జపాన్ నియంత్రణలో ఉన్న సింగపూర్ చేరుకున్నారు. జూన్ 4, 1944 న, సుభాష్ చంద్రబోస్ సింగపూర్ రేడియో నుండి ఒక సందేశాన్ని ప్రసారం చేసారు. మహాత్మా గాంధీని జాతిపిత అని సంబోధించారు.

సుభాష్ బోస్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం చివరి పోరాటం ప్రారంభమైంది. బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టే వరకు ఈ సాయుధ పోరాటం కొనసాగుతుంది. కాసేపు ఆగి ‘జాతి పితామహుడు భారతదేశ స్వాతంత్ర్య కోసం పోరాటం చేస్తున్న మేము మీ ఆశీస్సులు కోరుతున్నాము’ అని చెప్పాడు.

విమాన ప్రమాదంలో సుభాష్ బోస్ మరణించారనే వార్తపై గాంధీజీ ‘అతనిలాంటి దేశభక్తుడు మరొకరు లేరనీ, ఆయన దేశభక్తుల యువరాజు’ అని అన్నారు. 1946 ఫిబ్రవరి 24న తన ‘హరిజన్’ పత్రికలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్ మాయాజాలం మనపై వ్యాపించింది. నేతాజీ పేరు దేశమంతా మారుమోగుతోంది. అతను అసాధారణమైన దేశభక్తుడు. సుభాష్ ధైర్యసాహసాలు.. దేశ చరిత్రలో ప్రకాశిస్తాయన్నారు.

bottom of page