top of page

ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి, సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది🤔

దేశవ్యాప్తంగా ఇటీవల ఎలక్టోరల్ బాండ్లపై చర్చ జరుగుతోంది. కారణం సుప్రీంకోర్టు వీటిని రద్దు చేయడమే. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయడమే కాకుండా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. అసలీ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం ఏంటో తెలుసుకుందాం.

ఫిబ్రవరి 15 వతేదీన ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ తరువాత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాల డేటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి అందించింది. ఇప్పుడిక ఈ వివరాలను ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్‌లో ప్రదర్శించింది . అంటే ఏ పార్టీకి  ఎప్పుడు ఎంతమేర విరాళాలు వచ్చాయో తేలిపోయింది . 

ఎలక్టోరల్ బాండ్లు అంటే

ఎలక్టోరల్ బాండ్లు అనేవి రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చుకునేందుకు ప్రవేశపెట్టినవి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2018లో వీటిని ప్రవేశపెట్టింది. వీటిని దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే జారీ చేస్తుంది. ఇవి ప్రామిసరీ నోట్ లాంటివి. ఎవరైనా వ్యక్తులు లేదా కంపెనీలు వీటిని కొనుగోలు చేసి నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇస్తాయి. రాజకీయ పార్టీలు వాటిని తిరిగి ఎస్బీఐలో నగదుగా మార్చుకుంటాయి. ఈ బాండ్లకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. బాండ్ల కొనుగోలు ఎంతైనా చేయవచ్చు. గరిష్టంగా పరిమతి లేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29ఎ ప్రకారం నమోదైన రాజకీయ పార్టీలు గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 1 శాతం ఓట్లు పొందితేనే ఎలక్టోరల్ బాండ్లు పొందగలవు.

న్యాయస్థానం ఎందుకు రద్దు చేసింది

రాజకీయ పార్టీలు తమ విరాళాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంతో వివాదం మొదలైంది. విమర్శలు చెలరేగాయి. కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ బాండ్లలో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు వెల్లువెత్తుుతన్నాయి. ఈ బాండ్లు ప్రవేశపెట్టిన తరువాత వాటిలో అత్యధిక శాతం కేంద్ర, రాష్ట్రాల్లోని అధికార పార్టీలకే వెళ్లాయి.  ఈ బాండ్లు కచ్చితంగా క్విడ్ ప్రో కో కిందకు వస్తాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇవి రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ వాటిని నిషేధించింది. విరాళాల వివరాలు గోప్యంగా ఉంచడమంటే సమాచార హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ధర్మాసనం తెలిపింది. 

bottom of page