top of page
MediaFx

రత్న భాండాగారంపైనే అందరి చూపు.. రహస్య గదుల్లో ఏముంది..?


పూరీ జగన్నాథ్‌ ఆలయ రత్న భాండాగారంలో మరో రహస్య గది ఇవాళ తెరుచుకోనుంది. అయితే ఆ రహస్య గదిలోకి సొరంగ మార్గం ద్వారా వెళ్లాల్సి రావడం.. ఆ మార్గం గురించి చరిత్రకారులు పలు రకాలు చెబుతుండటం మరింత ఆసక్తి పెంచుతోంది. అసలు ఇవాళ ఏం జరగబోతోందని యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం దేశ ప్రజల చూపంతా ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారంపైనే ఉంది. రహస్య గదుల్లో ఏముంది…? ఎంత సంపద బయటపడుతుందో తెలుసుకోవాలని దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటికే రెండు రహస్య గదులను తెరిచిన రిటైర్డ్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ.. గురువారం (జూలై 18) మూడో గదిని తెరిచేందుకు సిద్ధమవుతోంది.

46ఏళ్ల తర్వాత తొలిసారి జూలై నెల 14న రెండు రహస్య గదులను తెరిచారు అధికారులు. రత్న భాండాగారంలోని ఇన్నర్, ఔటర్ చాంబర్స్ తెరిచారు. అందులోని విలువైన ఆభరణాలను టేక్ తో చేసిన చెక్క పెట్టెల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. దానిని వీడియోగ్రఫీ కూడా చేయించారు. అప్పటికే సాయంత్రం కావడం వల్ల నిబంధనల ప్రకారం మూడో గదిని తెరవలేదు. దీంతో మూడో రహస్య గది ఓపెనింగ్‌కి ఇవాళే మూహుర్తం ఫిక్స్‌ చేశారు. సొరంగ మార్గం ద్వారా మాత్రమే ఆ గదిలోకి వెళ్లే అవకాశం ఉండటంతో… మూడో గది ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక తెరవబోయే మూడో గదిలోని సంపదను కూడా స్ట్రాంగ్‌ రూమ్‌కి తరలించనున్నారు. ఆ తర్వాత ఈ భాండాగారాన్ని పురావస్తు శాఖకు అప్పగించనున్నారు. ఈ రహస్య గదిలో 34 కిరీటాలు, రత్న ఖచిత స్వర్ణ సింహాసనాలు, దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక సంపద లెక్కింపు, గదుల మరమ్మతుల తర్వాతనే మళ్లీ రహస్య గదుల్లోకి సంపద వెళ్లనుంది. మరోవైపు రహస్య గదిని తెరుస్తున్న కారణంగా క్షేత్రంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు ఆలయమండలి తెలిపింది.

మొత్తంగా… మూడో గది ఓపెనింగ్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సొరంగ మార్గంలో ఎలా వెళ్తారు..? ఎలాంటి సంపదను గుర్తిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

bottom of page