నల్లగొండ వేదికగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.
ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. నల్గొండతో పాటు కృష్ణా నది పరిసరాల్లోని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. నల్గొండ పట్టణమంతా గులాబీమయంగా మారింది. ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ కావడం.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఏం మాట్లాడుతారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా.. ఛలో నల్గొండ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివస్తున్నాయి.. ఈ క్రమంలో సభకు పోలీసులు సహకరించడం లేదని బీఆర్ఎస్ నేతల ఆరోపిస్తున్నారు. దీంతో సభా ప్రాంగణంలో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున బౌన్సర్లను ఏర్పాటు చేశారు.
ఇదిలాఉంటే.. బీఆర్ఎస్ సభను వ్యతిరేకిస్తూ.. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతల బస్సుపై కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో నల్లగొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 🚓