top of page
MediaFx

ఉక్రెయిన్‌తో యుద్ధం.. భార‌త్‌తో ట‌చ్‌లో ఉన్నాం: వ్లాదిమిర్ పుతిన్


భార‌త్‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) తెలిపారు. ఉక్రెయిన్‌తో జ‌రుగుతున్న యుద్ధం విష‌యంలో.. భార‌త్ అభిప్రాయాల‌ను గౌర‌విస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. భార‌త్‌తో పాటు మ‌రో రెండు దేశాల మాట‌ల‌ను కూడా ఆల‌కిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఉక్రెయిన్ అంశంలో భార‌త్‌తో నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రుగుతున్న‌ట్లు పుతిన్ పేర్కొన్నారు. యుద్ధ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు భార‌త్ చాలా నిష్ట‌తో ప‌నిచేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ర‌ష్యా ఏజెన్సీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పుతిన్ ఈ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. వాడివొస్టోక్‌లో జ‌రిగిన ఈస్ట్ర‌న్ ఎకాన‌మిక్ ఫోర‌మ్ స‌ద‌స్సు అంశాల‌ను పుతిన్ పేర్కొన్నారు. చ‌ర్చ‌ల‌తో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌న్న ఆలోచ‌న ఉక్రెయిన్‌కు ఉంటే, దానికి తాము సిద్దంగా ఉన్న‌ట్లు పుతిన్ వెల్ల‌డించారు. అయితే ఇటీవ‌ల కొన్ని వారాల క్రితం భార‌త ప్ర‌ధాని మోదీ.. ఉక్రెయిన్‌లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఆయ‌న అధ్య‌క్షుడు జెలెన్‌స్కీతో క‌లిశారు. ఈ నేప‌థ్యంలో పుతిన్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

స్నేహితుల‌ను, భాగ‌స్వామ్యుల‌ను గౌర‌విస్తామ‌ని, ఉక్రెయిన్‌తో ఉన్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు చైనా, బ్రెజిల్‌, ఇండియా ఇస్తున్న స‌ల‌హాల‌ను స్వీక‌రిస్తున్నామ‌ని, ఈ అంశంపై మిత్ర‌దేశాల‌తో నిరంత‌రం ట‌చ్‌లో ఉన్న‌ట్లు పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌డంలో భార‌త్ కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్లు ర‌ష్యా అధ్య‌క్ష భ‌వ‌న ప్ర‌తినిధి దిమిత్రి పిస్కోవ్ తెలిపారు. ప్ర‌ధాని మోదీ, పుతిన్ మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క సంబంధాలు ఉన్నాయ‌ని, పుతిన్‌తో పాటు జెలెన్‌స్కీ, అమెరిక‌న్ల‌తోనూ మోదీ మంచి ప‌రిచ‌యం ఉన్న‌ద‌ని, ప్ర‌పంచ వ్య‌వ‌హారాల్లో భార‌త్ త‌న అవ‌కాశాన్ని వాడుకోవ‌డానికి ఇది సంద‌ర్భం అవుతుంద‌ని, అమెరికా-ఉక్రెయిన్ దేశాల‌ను శాంతి వైపుగా మ‌ళ్లించే స‌త్తా భార‌త్‌కు ఉన్న‌ట్లు పిస్కోవ్ వెల్ల‌డించారు.

అయితే ఉక్రెయిన్‌, ర‌ష్యా వివాదంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వం నిర్వ‌హించేందుకు ప్ర‌ధాని మోదీ సిద్దంగా ఉన్నారా లేదా అన్న విష‌యాన్ని మాత్రం పిస్కోవ్ స్ప‌ష్టం చేయ‌లేదు. జెలెన్‌స్కీతో భేటీకి కొన్ని వారాల ముందే పుతిన్‌ను కూడా మోదీ క‌లిశారు. అయితే ఉక్రెయిన్ అంశంలో శాంతి స్థాప‌న కోసం మోదీ ప్ర‌య‌త్నిస్తార‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. తాము శాంతి వైపు ఉంటామ‌ని ఇటీవ‌ల ప‌ర్య‌ట‌న‌లో మోదీ పేర్కొన్న విష‌యం తెలిసిందే.


bottom of page