top of page
MediaFx

బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన హింస.. 50 మందికి గాయాలు


పొరుగుదేశం బంగ్లాదేశ్‌ (Bangladesh)లో మరోసారి హింస చెలరేగింది. రాజధాని ఢాకా (Dhaka)లో విద్యార్థులకు, పారామిలిటరీ దళమైన అన్సార్‌ సభ్యులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 50 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా ఢాకా ట్రిబ్యూన్‌ నివేదించింది. విలేజ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌గా (paramilitary personnel ) పిలిచే అన్సార్‌ సభ్యులు (Ansar members) ఉద్యోగాల క్రమబద్దీకరణ కోరుతూ గత రెండు రోజులుగా ఆందోళన చేపట్టారు. అందుకు తాత్కాలిక ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆదివారం ఉదయం వారు తమ ఆందోళనను విరమించారు. ఇది తెలుసుకున్న విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఢాకా యూనివర్సిటీకి (Dhaka University) చెందిన వందలాది మంది విద్యార్థులు రాజు స్మారక శిల్పం నుంచి సెక్రటేరియట్‌ వరకూ కవాతు నిర్వహించారు. వీరి కవాతును అన్సార్‌ సభ్యులు అడ్డుకున్నారు.

విద్యార్థి నాయకుడు, ఆపద్ధర్మ ప్రభుత్వంలో సలహాదారుగా నియమితులైన నహిద్‌ ఇస్లాం సహా పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. ఇది కాస్తా హింసాత్మకంగా మారింది. విద్యార్థులు, అన్సార్‌ సభ్యుల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దింపినట్లు సదరు మీడియా వెల్లడించింది.

కాగా, రిజర్వేషన్ల అంశంలో ఇటీవలే విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో బంగ్లాదేశ్‌ అట్టుడికిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజాగ్రహానికి జడిసి ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్‌లోనే తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు ఇటీవలే అక్కడ నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే.




bottom of page