భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) పారిస్ నుంచి భారత్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా రెజ్లర్‌కు ఘన స్వాగతం లభించింది. పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో వినేశ్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. 50 కేజీల విభాగంలో 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంగా ఫైనల్‌కు కొన్ని క్షణాల ముందు రెజ్లర్‌పై అనర్హత వేటు పడింది. దీంతో యావత్తు భారత దేశం తీవ్ర నిరాశ చెందింది. ఇక తన ‘అనర్హత వేటు’పై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్)ను వినేశ్ ఆశ్రయించగా.. అక్కడా నిరాశే ఎదురైంది. ఈనెల 16న తీర్పు వెలువరించాల్సి ఉన్నా 14వ తేదీ రాత్రి ఉన్నఫళంగా ఆమె పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు ప్రకటించడం భారత క్రీడాభిమానులను నివ్వెరపోయేలా చేసింది. కారణాలేమీ చెప్పకుండానే ‘సింగిల్ లైన్ ఆర్డర్’తో కాస్ వెలువరించిన ప్రకటన అనంతరం ఆమెకు పలువురు క్రీడాకారులు మద్దతుగా నిలిచారు.
ఈ పరిణామాల అనంతరం వినేశ్ తొలిసారి భారత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా పెద్ద ఎత్తున అభిమానులు ఎయిర్‌పోర్ట్ వద్దకు వెళ్లారు. వారిని చూసిన వినేశ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు (breaks down in tears). దీంతో ఆమెను రెజ్లర్లు సాక్షిమలిక్, బజరంగ్ పునియా తదితరులు ఓదార్చారు.