top of page
MediaFx

అప్‌డేట్‌ ఇచ్చిన సంగీత దర్శకుడు!

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా, వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం "ది గోట్‌" (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). చిత్రీకరణ శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రం గురించి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఓ మ్యూజికల్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఒక ఈవెంట్‌లో పాల్గొన్న యువన్‌ శంకర్‌ "ది గోట్‌" పాటల గురించి మాట్లాడుతూ, "విజయ్‌ ఈ సినిమా కోసం రెండు పాటలు పాడారు. ఒకే సినిమాలో ఆయన రెండు పాటలు పాడడం ఇదే మొదటిసారి" అని తెలిపారు.

గతంలో కూడా విజయ్‌ తన చిత్రాల్లో పాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన దాదాపు 25 పాటలు పాడారు. 1994లో విడుదలైన "రసిగన్‌" కోసం మొదటిసారి పాడిన విజయ్‌ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. 2012లో "తుపాకీ" చిత్రంలోని "గూగుల్‌ గూగుల్‌" పాటకు "ఫేవరెట్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌" అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇప్పటివరకు ఒక్కో పాట పాడిన విజయ్‌ "ది గోట్‌" చిత్రానికి రెండు పాటలు పాడటం విశేషం.

తాజాగా "ది గోట్‌" చిత్రంలో విజయ్‌ పాడిన "విజిల్‌ పోడు" లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేయగా, అది మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని, కోట్ల వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రంలో విజయ్‌ కోసం ప్రత్యేకంగా "డీ-ఏజింగ్‌ టెక్నాలజీ" వాడారు. ఈ టెక్నాలజీతో ఆయన్ని 25ఏళ్ల కుర్రాడిలా చూపించనున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు కూడా ఇటీవలే పూర్తయ్యాయి. లాస్‌ ఏంజెలిస్‌లోని స్టూడియోలో "అవతార్‌", "అవెంజర్స్‌" వంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్స్‌కి పనిచేసిన నిపుణులు ఈ చిత్రం కోసం వర్క్‌ చేశారు.

మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రధారులు. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

bottom of page