ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతుంది. సోషల్ మీడియా పిచ్చిలో పడిపోయి.. యువత విపరీత పోకడలు పోతున్నారు. లైక్స్, వ్యూస్ కోసం దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇప్పటికే రీల్స్‌లో ఆశ్లీలత పెరిగిపోయింది. అంతేకాదు.. కొందరు రీల్స్ కోసం పిచ్చి పనలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రీల్ చేస్తూ… ఒక మైనర్ బాలిక ఆరో అంతస్తు నుండి పడి తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు మరో షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో… ఒక వ్యక్తి తన మెడ వరకు మట్టిలో కప్పబడి ఉండటం చూడవచ్చు. అతని తల్లిగా చెబుతున్న మహిళ ఆ వ్యక్తికి ఆహారం తినిపిస్తుండగా.. పక్కనే కూర్చున్న మరో మహిళను అతడి భార్యగా చెబుతున్నారు. ఈ వీడియో చూసిని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా ప్రసిద్ధి చెందాలనే కోరికతో, కొంతమంది ఇప్పుడు పరిమితులు దాటుతున్నారని వాపోతున్నారు.
దీనికి ఇప్పటివరకు 5.5 లక్షల వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో, చాలా మంది యూజర్స్ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం, నెట్టింట అసభ్యకరమైన లేదా ప్రమాదకరమైన చర్యలను ప్రోత్సహించడం నైతికతకు విరుద్ధం అని, ఇది సమాజంలో తీవ్రమైన సమస్యగా మారుతోందని చాలామంది అంటున్నారు. ఈ సవాలును ఎదుర్కోవడానికి ప్రభుత్వం, సమాజం రెండూ కలిసి చర్యలు తీసుకోవాలని మరొక యూజర్ కామెంట్ పెట్టాడు.
రీల్స్, షార్ట్స్ ద్వారా డబ్బు సంపాదించాలనే ఈ దురాశ ఏదో ఒక రోజు మానవ జీవితానికి శత్రువుగా మారుతుందని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. ఈ రకమైన హానికరమైన కంటెంట్‌ను అరికట్టడానికి కఠినమైన చట్టాలు చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.