top of page

ఉత్తరాఖండ్​లో అల్లర్లు.. నలుగురు మృతి- 250మందికి గాయాలు..!

మదరసా, మసీదును తొలగించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్​లోని హల్ద్వాని ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు.

ఉత్తరాఖండ్​లోని హల్ద్వాని ప్రాంతం.. అల్లర్లతో అట్టుడికింది. అక్రమంగా నిర్మించారన్న కారణంతో అధికారులు ఓ మదరసాను, దాని పక్కనే ఉన్న మసీదును కూలగొట్టడంతో గురువారం.. ఆ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 250మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. పరిస్థితిని అదుపుచేసేందుకు స్థానిక యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. అల్లర్లకు పాల్పడిన వారిపై షుట్​ అట్​ సైట్​ ఆర్డర్లు జారీ చేసింది. ఇంటర్నెట్​ సేవలను నిలిపివేసింది. ఉత్తరాఖండ్​ హింసాత్మక ఘటన నేపథ్యంలో స్కూళ్లు మూతపడ్డాయి. 

హల్ద్వాని ప్రాంతంలోని ప్రభుత్వ భూమిపై మదరసా, మసీదును నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. కోర్టు ఆదేశాలతో.. వాటిని తొలగించేందుకు గురువారం అక్కడికి వెళ్లారు అధికారు. భారీ బలగాన్ని తీసుకెళ్లారు. బుల్డోజర్లు మదరసాను, మసీదును తొలగిస్తున్న సమయంలో.. ఆగ్రహానికి గురైన స్థానికులు.. వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. బ్యారికెడ్లును తోసుకుంటూ.. ముందుకొచ్చి, పోలీసుల చర్యలను ఆపే ప్రయత్నం చేశారు. పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ తర్వాత.. పరిస్థితి చెయ్యి దాటిపోయింది. స్థానికులు పోలీసులు, అధికారులపై దాడి చేశారు. రాళ్లు రువ్వారు. 20 మోటార్​సైకిళ్లను ధ్వంసం చేశారు. ఓ బస్సును తగలబెట్టారు.

ఉత్తరాఖండ్​ హింసాత్మక ఘటనలో 50మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. మున్సిపల్​ కార్మికులు, జర్నలిస్టులకు సైతం గాయాలయ్యాయి. పోలీస్​ స్టేషన్​ బయట ఉన్న వాహనాలకు నిరసనకారులు నిప్పంటించినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​ సింగ్​ ధామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోర్టు ఆదేశాలతో అధికారులు.. మదరసాను తొలగించేందుకు వెళ్లారని అన్నారు. అసాంఘిక శక్తులు.. పోలీసులపై దాడి చేశాయని ఆరోపించారు. ఆ ప్రాంతంలో అదనపు భద్రతను మోహరించినట్టు స్పష్టం చేశారు.

తాజా పరిస్థితులపై మున్సిపల్​ కమిషనర్​ స్పందించారు.

"ఆ ప్రాంతంలో మదరసా, మసీదును అక్రమంగా కట్టారు. ఇప్పటికే 3 ఎకరాల భూమిని సీజు చేశాము. అందుకే.. వాటిని తొలగించేందుకు వెళ్లాము. స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనపై షుట్​ అట్​ సైట్​ ఆర్డర్లు అమల్లో ఉన్నాయి," అని మున్సిపల్​ కమిషనర్​ తెలిపారు.

హల్ద్వాని ప్రాంతంలో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. అన్ని దుకాణాలు, స్కూళ్లు మూతపడ్డాయి. పరిస్థితు ఉద్రిక్తంగానే ఉంది. గాయపడిన వారు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మదరసా, మసీదులను తొలగిస్తున్నారని, అధికారుల చర్యలను వెంటనే అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్​పై ఉత్తరాఖండ్​ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కానీ అధికారులు వెనక్కి రావాలని హైకోర్టు ఎలాంటి ఆదేశాలివ్వలేదు. విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది.

bottom of page