top of page
MediaFx

అమిత్ షా నకిలీ వీడియో సృష్టి తెలంగాణలోనే..


రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియో సృష్టించింది తెలంగాణలోనేనని తేలింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ (IFSO Unit) ఐపీ అడ్రస్ ఆధారంగా వీడియో సృష్టించిన ప్రదేశం తెలంగాణలోనే ఉందని గుర్తించింది. ఈ క్రమంలో నకిలీ వీడియో సృష్టికర్తలను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీస్ IFSO (ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్) విభాగం అధికారులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.

మరోవైపు ఆ నకిలీ వీడియో సృష్టికర్తలను తెలంగాణ పోలీసులు అప్పటికే అరెస్టు చేయడంతో ట్రాన్సిట్ వారంట్‌పై వారిని ఢిల్లీకి తరలించి ప్రశ్నించాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఆ మేరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరెస్టయిన నలుగురూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడం, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తుండడం కేసులో కీలక మలుపుగా మారింది. కేసు నమోదు చేసిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసినవారికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసింది. ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుని గాంధీభవన్‌లో సమన్లు స్వయంగా అందజేయగా.. సమన్లు అందుకున్నవారిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. వారిని మే 1న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఆదేశించినప్పటికీ.. హాజరుకాకుండా ఒక జవాబు మాత్రం పంపించారు. రేవంత్ రెడ్డి సహా సమన్లు అందుకున్నవారు పంపిన జవాబుపై ఢిల్లీ పోలీసులు సంతృప్తి చెందలేదని తెలిసింది. అందుకే తాజాగా మరోసారి సమన్లు జారీ చేసేందుకు ఢిల్లీ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఐపీ అడ్రస్ ఆధారంగా తొలుత ఆ వీడియోను పోస్టు చేసినవారిని గుర్తించి అరెస్టు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.


bottom of page