top of page
MediaFx

రీల్స్ చేస్తూ జలపాతంలో పడి ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ దుర్మరణం..


సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గుర్తింపు పొందిన యువతిని.. అదే వీడియో ప్రాణాలు తీసింది. వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ విశేషాలను తన వీడియోల ద్వారా వివరించే ఆమె.. ఓ పర్యాటక ప్రాంతంలో రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్‌దార్ (26) కుంభే జలపాతం వద్ద రీల్‌ చేస్తుండగా జారిపడి దుర్మరణం చెందింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముంబయిలో నివాసం ఉండే ఆన్వీ కామ్‌దార్‌ (26).. ఇన్‌స్టాగ్రామ్‌‌లో ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందారు. పలు ప్రాంతాలను సందర్శిస్తూ తన వీడియోల ద్వారా అవగాహన కల్పించే ఆన్వీ.. జులై 16న మంగళవారం తన ఏడుగురు స్నేహితులతో కలిసి మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ సమీపంలో ఉన్న కుంభే జలపాతం సందర్శనకు వెళ్లారు. అక్కడి ప్రకృతి అందాలను వీడియో తీసే క్రమంలో.. ఓ లోయకు అంచున ఆమె నిలబడ్డారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు జారిపడిన అన్వీ.. 300 అడుగుల లోతులో పడిపోయారు. తక్షణమే స్పందించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు శ్రమించి ఆమెను బయటకు తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇన్‌స్టాలో ఆన్వీకి 2.56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె రీల్స్, వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ ఉన్నాయి. వృత్తిరీత్యా ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ అయిన అన్వీ... డెలాయిట్‌లో పనిచేశారు. భారత్‌తో పాటు విదేశాల్లోని పలు ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడ విశేషాలను తన వీడియోల ద్వారా అవగాహన కల్పించేవారు. ఇన్‌స్టా బయోలో తనను తాను ట్రావెల్ డిటెక్టివ్‌గా రాసుకున్నారు. ముఖ్యంగా వర్షకాలం పర్యాటకంపై చిత్రీకరించిన వీడియోలే ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. రెస్క్యూలో పాల్గొన్న అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ప్రమాదం గురించి తెలిసినవెంటనే అక్కడకు చేరుకున్నాం.. యువతి 300-350 అడుగుల లోతులో జారిపడింది.. మేము ఆమె వద్దకు చేరుకున్నప్పటికీ బయటకు తీసుకురావడం కష్టమైంది.. అప్పటికే ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.. ఇదే సమయంలో భారీ వర్షం కురుస్తోంది.. చివరకు పైకి సమాంతరంగా లాగాలని నిర్ణయించాం.. ఆరు గంటల పాటు శ్రమించి లోయ నుంచి బయటకు తీసుకొచ్చాం’ అని తెలిపారు.



ఈ ఘటన నేపథ్యంలో సహ్యాద్రి శ్రేణుల సుందర దృశ్యాలను తిలకిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పర్యాటకాన్ని ఆస్వాదించాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పర్యాటకులకు, పౌరులకు స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రాణాలకు ప్రమాదం కలిగించే చర్యలను నివారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.


bottom of page