top of page

బరువు తగ్గే ఆపరేషన్ చేయించుకుంటుండగా యువకుడు మృతి🏥


కొంత మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు జిమ్, గ్రౌండ్‌లో కష్టపడటం, యోగా సెంటర్లకు వెళ్లడం, ఫుడ్ తగ్గించడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఊబకాయంతో బాధపడుతున్న ఓ యువకుడు.. అన్ని ప్రయత్నాలు చేసి.. చివరికి బరువు తగ్గే ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వివిధ ఆస్పత్రుల్లో వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఒక ఆస్పత్రిలో వెయిట్ లాస్ ఆపరేషన్‌కు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పగా.. మరో ఆస్పత్రిలో కేవలం రూ.4 లక్షల్లోనే ఆపరేషన్ అవుతుందని తెలిపారు. దీంతో ఆ ఆస్పత్రిలో చేరిన యువకుడికి.. వెయిట్ లాస్ సర్జరీ జరుగుతుండగా.. తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు.

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పుదుచ్చేరికి చెందిన హేమచంద్రన్‌ బరువు తగ్గే ఆపరేషన్ జరుగుతుండగా ప్రాణాలు కోల్పోయాడు. హేమచంద్రన్‌ వయసు 26 ఏళ్లు కాగా.. బరువు మాత్రం 150 కిలోలు. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్న హేమచంద్రన్.. చెన్నై పమ్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించాడు. ఏప్రిల్ 3 వ తేదీన ఆస్పత్రికి వెళ్లిన హేమచంద్రన్‌.. సర్జరీ చేయడానికి రూ.4 లక్షల ఖర్చు అవుతుందని తెలుసుకున్నాడు. అనంతరం అదే ఆస్పత్రిలో మెడికల్ టెస్ట్‌లు చేసిన డాక్టర్లు.. డయాబెటిస్ ఎక్కువగా ఉందని.. కొన్ని రోజుల తర్వాత రావాలని సూచించారు. దీంతో ఈ నెల 21 వ తేదీన ఆస్పత్రికి వెళ్లగా.. ఆ తర్వాతి రోజు సర్జరీ చేపట్టారు.

ఈ నెల 22 వ తేదీన ఉదయం 9:30 గంటలకు హేమచంద్రన్‌కు మెటబాలిక్, బేరియాట్రిక్ సర్జరీని డాక్టర్లు ప్రారంభించారు. అయితే ఆపరేషన్‌ చేస్తుండగానే హేమచంద్రన్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే డాక్టర్లు మరో ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో హేమచంద్రన్ మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు శంకర్‌నగర్ పోలీస్స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని.. ఆ ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.


bottom of page