తెలంగాణలో టమాటా ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. మొన్నటివరకు సెంచరీని తాకిన ధరలు..ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీకి కూడా చేరుకుంటున్నాయి. తాజాగా కొమరం భీం ఆసిఫాాబాద్ జిల్లాలో కేజీ టమాటా ధర రికార్డు స్థాయిలో రూ.180 పలికింది.
Tomato Prices: తెలంగాణ టమాటా ధరలు రికార్డులు సృష్టిస్తోన్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఆల్ టైం రికార్డు స్ధాయికి ధరలు చేరుకుంటున్నాయి. రోజురోజుకు టమాటా ధరలు పెరుగుతూనే ఉండటంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. పెరుగుతున్న ధరలతో అసలు కూరల్లో టమాటమాలను వాడటమే కొంతమంది మానేస్తున్నారు. టమాటా బదులు కూరల్లో రుచి కోసం ఇతర ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. రోజురోజుకి పెరుగుతున్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా రూ.180కి చేరుకుంది.
ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటల మండల కేంద్రంలో టమాటా ధర రికార్డు స్థాయిలో రూ.180 పలికింది. కొంతమంది చిరు వ్యాపారులు కేజీ టమాటాను రూ.180కి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది. రెండు వారాల క్రితం రూ.50గా ఉన్న టమాటా ధర క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల రూ.100కి చేరుకోగా.. ఆ తర్వాత రూ.150కి చేరుకుంది. ఇప్పుడు ఏకంగా కొన్నిచోట్ల రూ.180 పలుకుతుండటంతో.. సామాన్యులు షాక్ అవుతున్నారు. జిల్లా కేంద్రాల్లో రూ.120 నుంచి రూ.150 వరకు చిరు వ్యాపారులు విక్రయిస్తుండగా.. గ్రామాల్లో రేటు పెంచి అమ్ముతున్నారు. దీంతో టమాటాలను కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ధరలు పెరగడానికి ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం కూడా కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ధరల పెరుగుదలపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. దీంతో వ్యాపారులు తమకు ఇష్టమొచ్చిన రేట్లకు విక్రయిస్తున్నారు. తెలంగాణలో టమాటా సాగు లేకపోవడంతో ఏపీ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తెప్పించుకుంటున్నారు. అక్కడ నుంచి తక్కువ ధరలకు తెప్పించుకుని ఇక్కడ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. వ్యాపారులే టమాటాకు రేటును నిర్ణయించుకుని వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పర్యవేక్షణ చేపట్టాలని, ధరల పెరుగుదలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.