తెలంగాణలో టమాటా ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పలువురు వ్యాపారులు కేజీ టమాటా రూ.150కి అమ్ముతున్నారు. రానున్న నెల రోజుల్లో ధరలు తగ్గే అవకాశముందని కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటన సామాన్యులకు కాస్త ఉపశమనాన్ని కల్గిస్తోంది.
టమాటా ధరలు మోత మోగిస్తున్నాయి. రోజురోజుకి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో.. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఇంతకుముందు కేజీ రూ.20 పలికిన టమాటా ధరలు.. గత రెండు వారాలుగా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఆ తర్వాత కేజీ రూ.50, రూ.100కి చేరుకున్న టమాటా ధరలు.. ఇప్పుడు ఏకంగా రూ.150 పలుకుతున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు టమాటాలను కొనుగోలు చేయడమే మానేస్తున్నారు. మరికొంతమంది కేజీ తీసుకునే బదులు అరకేజీ, పావుకేజీ తీసుకుంటున్నారు. తాజాగా కొమురం భీం జిల్లా రవీంద్రనగర్‌లో టమాటా ధర ఆల్ టైం రికార్డు స్థాయి ధర పలికింది. వారసంతలో కేజీ టమాటా రూ.140 పలికింది. ఇక హైదరాబాద్‌లోని పలు దుకాణాల్లో కేజీ రూ.150కి వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా టమాటా పంట పూర్తిగా దెబ్బతింది. దీని వల్ల రైతులు తీవ్ర నష్టపోగా.. వానలకు పంట నష్టం జరగడంతో దిగుబడి కూడా భారీగా తగ్గిపోయింది. అలాగే ఈ సారి టమాటా పంట సాగు కూడా పెద్ద మొత్తంలో తగ్గింది. ఎక్కువమంది రైతులు టమాటా పంట వేసేందుకు ఆసక్తి చూపలేదు. ధరలు పెరగడానికి ఇవి కారణాలుగా తెలుస్తోన్నాయి. అలాగే తెలంగాణలో టమాటా పంట లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. దీని వల్ల రవాణా ఖర్చులు కూడా అధికం కావడం వల్ల దాని ప్రభావం కూడా టమాటా ధరలపై పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పట్లో టమాటా ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. టమాటా ధరలు భారీగా ఉండటం వల్ల వినియోగదారులు కూడా ఎక్కువగా కొనుగోలు చేయడం లేదని చెబుతున్నారు. వినియోగదారులు తక్కువ మోతాదులోనే కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా టమాటా ధరలు రూ.100కి చేరుకున్నాయి.టమాటా ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. మరో 15 రోజుల్లో ధరలు కాస్త తగ్గుతాయని, మరో నెల రోజుల్లో సాధారణ ధరకు చేరుకుంటాయని స్పష్టం చేసింది. ఉత్పత్తి కేంద్రాల నుంచి సరఫరా పెరిగిందని, మరికొద్ది రోజుల్లో ధరలు తగ్గే అవకాశముందని తెలిపింది. ప్రతి కూరలోనూ తప్పనిసరిగా టమాటా వాడతారు. కానీ టమాటా ధరలు పెరగడంతో చాలామంది కూరల్లో వాడటం కూడా మానేశారు. టమాటా ధరలతో పాటు పచ్చిమిర్చి ధరలు కూగా పెరిగాయి. కేజీ పచ్చిమిర్చి ధర రూ.120కి చేరుకుంది. ఇక క్యాప్సికం ధర కూడా భారీగా పెరగడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి.