ట్రిపులార్ తరువాత సెట్‌లో అడుగు పెట్టేందుకు కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్న ఎన్టీఆర్, వన్స్ షూటింగ్‌కు షురూ చేశాక మాత్రం ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నారు. తాజాగా దేవర కాంపౌండ్ నుంచి వస్తున్న ఓ అప్‌డేట్ జూనియర్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
ట్రిపులార్ రిలీజ్ తరువాత దాదాపు ఏడాది పాటు కెమెరా ముందుకు రాలేదు జూనియర్ ఎన్టీఆర్. తన కోస్టార్ రామ్ చరణ్ ట్రిపులార్ సెట్స్ మీద ఉండగానే మరో మూవీని స్టార్ట్ చేస్తే, తారక్ మాత్రం ఎనౌన్స్ చేసిన సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు.
కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది మార్చి ఎండింగ్‌లో కొరటాల కాంబినేషన్‌లో దేవర సినిమాను స్టార్ట్ చేశారు తారక్. తొలి షెడ్యూల్‌లో రెండు నెలల పాటు యాక్షన్, టాకీ పార్ట్ చిత్రీకరించారు.
ఆ తరువాత కూడా షార్ట్ గ్యాప్స్‌తోనే వరుస షెడ్యూల్స్‌లో షూటింగ్ చేస్తున్నారు. వీలైనంత వరకు బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ చేసేలాగే ప్లాన్ చేస్తోంది కొరటాల టీమ్. తారక్ స్పీడుకు కొరటాల మేకింగ్ స్టైల్ కూడా మ్యాచ్ అవ్వటంతో దేవర పార్ట్ వన్ షూటింగ్ జెట్ స్పీడుతో పూర్తవుతోంది.
ఈ డిసెంబర్ కల్లా తొలి భాగానికి గుమ్మడి కాయ కొట్టేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే టాప్ స్టార్స్‌లో పాన్ ఇండియా సినిమాను ఇంత త్వరగా పూర్తి చేసిన రికార్డ్ తారక్ సొంతమవుతోంది. డిసెంబర్ కల్లా దేవర పార్ట్ 1 వర్క్ ఫినిష్ చేసి జనవరి నుంచి వార్ 2 సెట్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు తారక్.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆల్రెడీ వర్కవుట్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ ఇంత స్పీడుగా సినిమాలు చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 🎬🔥