టీటీడీ.. తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక నుంచి కొండపై వసతులు, దర్శనం. అన్నీ కొత్తగా ఉండబోతున్నాయా? అవకాశం ఉన్న చోట మార్పులు చేపట్టి, శ్రీవారి దర్శనం భక్తుడికి జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని టీడీపీ భావిస్తోందా? కొత్త ఈవో శ్యామల రావు లక్ష్యం ఇదేనా? మొదటి రోజు నుంచే ప్రక్షాళన ప్రారంభమైందా? ఇంతకీ కొండపై రాబోయే మార్పులేంటి? అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.
తిరుమల నుంచే ప్రక్షాళన. పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజకీయం కుదరదు. తిరుమలలో గోవింద నామస్మరణనే మార్మోగాలి.. ఇవీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం.. టీటీడీ ఈఓ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుకు అప్పగించింది. శ్యామలరావు సైతం వెంటనే రంగంలోకి దిగారు. ముందు తిరుమలలో వరాహస్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈఓగా బాధ్యతలు తీసుకున్న శ్యామల రావు తన ముందున్న లక్ష్యాలు, సవాళ్లను వివరించారు. తిరుమల క్షేత్రం హిందువులకు ఎంతో పవిత్రమైనది, ఇలాంటి క్షేత్రానికి ఈఓగా రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. తిరుమల యాత్ర భక్తులకు జీవితాంతం గుర్తుండి పోయేలా చేస్తామన్న ఈఓ.. ప్రతీ విషయం పారదర్శకంగా, అకౌంటబిలిటీ ఉండేలా చూస్తామంటున్నారు.
ఈఓగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే తిరుమలలో తనిఖీలు చేపట్టారు. సమూల మార్పులు లక్ష్యంగా రంగంలోకి దిగిన ఈఓ సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించారు. నందకం గెస్ట్ హౌస్ నుంచి శిలాతోరణం ద్వారా నారాయణగిరి షెడ్ల వరకు నడిచి వెళ్తూ భక్తులతో మాట్లాడారు. భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఈఓ ఇద్దరు శానిటరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడంపైన అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీటీడీలో ప్రక్షాళన షురూ అంటున్న ప్రభుత్వం ముందు సమస్యలు, సవాళ్లు ఏంటన్న దానిపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయంలో అమలైన విధానాలను కొనసాగించాలా వద్దా అన్నదానిపై ఫోకస్ పెట్టింది. వీఐపీ బ్రేక్ దర్శనం విషయంలో పాత విధానం అమలుకే మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ దర్శనం కొనసాగుతోంది. ఈ విధానంతో శ్రీవారి సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. దీంతో పాత విధానం మేలని శ్రీవారి నైవేద్య సమయంలోపే విఐపి బ్రేక్ దర్శనాలను ముగించాలని టీటీడీ భావిస్తోంది.
మరోవైపు సామాన్య భక్తులు వసతి గదులు పొందేలా చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. అందుబాటులో ఉన్న 7800 అతిథి గృహాలతో పాటు పిలిగ్రీం ఎమ్యూనిటీ సెంటర్లను అందుబాటులో తీసుకురావాలని ఆలోచిస్తోంది. నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్న టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. అన్న ప్రసాదం, లడ్డూల నాణ్యత, తిరుమలలో పచ్చదనం, పారిశుద్ధ్యం వంటి అంశాలను టాప్ ప్రియారిటీ గా తీసుకుంది.