హైదరాబాద్ యువ బ్యాటర్ తిలక్ వర్మకు తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు తిలక్ వర్మతోపాటు యశస్వి జైశ్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అజిత్ అగార్కర్ జట్టు ఎంపికలో తనదైన మార్క్ చూపెట్టాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టును అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు ఎంపిక చేశారు. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మరోసారి టీ20ల నుంచి విశ్రాంతి కల్పించగా.. టీమిండియాకు హార్దిక్ పాండ్య నేతృత్వం వహించనున్నాడు.ఐపీఎల్ 2023లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన యువ ప్లేయర్లు యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మను సెలక్టర్లు విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. యశస్వి జైశ్వాల్‌ను వెస్టిండీస్‌తో టెస్టులకు కూడా ఎంపిక చేయగా.. తిలక్ వర్మకు మాత్రం టీమిండియా నుంచి పిలుపు అందడం ఇదే తొలిసారి. గత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా జైశ్వాల్ అదరగొట్టగా.. ముంబై ఇండియన్స్ విజయాల్లో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు.
2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20లకు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యువ పేసర్లు ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌లకు కూడా సెలక్టర్లు విండీస్ టూర్‌కు అవకాశం కల్పించారు. ఐపీఎల్లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, జితేశ్ శర్మ, నితిశ్ రాణా లాంటిి ఆటగాళ్లకు మాత్రం నిరాశే ఎదురైంది.భారత జట్టు వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో ఆగస్టు 3న ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. తర్వాతి రెండు మ్యాచ్‌లు గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో, చివరి రెండు మ్యాచ్‌లు ఫ్లోరిడాలో జరగనున్నాయి.