top of page
MediaFx

అక్కలూ.. ఇవీ మీ హక్కులు!


1 గృహహింసకు వ్యతిరేకంగా..

గృహహింస నిరోధక చట్టం – 2005.. మహిళలను ఇంట్లో ఎదురయ్యే హింస నుంచి రక్షిస్తుంది. గృహిణిపై చేయి చేసుకోవడమే కాదు.. ఆమెను మాటల ద్వారా, ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా, లైంగికంగా వేధించినా.. 498 సెక్షన్‌ ప్రకారం దోషులను కఠినంగా శిక్షించవచ్చు.

2 పనికి తగ్గ జీతం

సమాన పనికి సమాన వేతనం పొందడం మహిళల హక్కు. మహిళా కూలీలు మొదలుకొని.. ఉన్నతోద్యోగాలు చేసే మహిళల కోసం ‘సమాన వేతన చట్టం’ అమలులో ఉన్నది. పనిచేసే మహిళలు.. వారి సహోద్యోగులతో సమానమైన వేతనాన్ని ఈ చట్టం ద్వారా డిమాండ్‌ చేయొచ్చు. కూలీలు, ఉద్యోగినులకు వేతనాలు, ఇతర అలవెన్సుల విషయంలో లింగ వివక్ష చూపడం నేరం కూడా! 3 పని ప్రదేశాల్లో రక్షణ

పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేకమైన చట్టం ఉన్నది. ఈ చట్టం ప్రకారం.. పనిలో లైంగిక వేధింపులకు గురైతే.. ఉన్నతాధికారులకు నివేదించే హక్కు మహిళలకు ఉంది. ఈ చట్టం ప్రకారం.. పనిలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిపై విచారణ చేపట్టడానికి సంస్థలు అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటుచేయాలి. పది లేదా అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న ప్రతి కంపెనీ.. ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సిందే! ఎవరైనా మహిళా ఉద్యోగి వేధింపులకు గురైతే.. సదరు బాధితురాలు ఈ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు.

4 రాత్రిపూట అరెస్టు వద్దు

సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు.. మహిళలను అరెస్టు చేయకూడదు. ఏవైనా తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే.. ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశంతో మాత్రమే రాత్రి సమయంలో మహిళలను అరెస్టు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, మహిళా ఖైదీని ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్‌తోపాటు మహిళకు చెందిన కుటుంబసభ్యులు లేదా స్నేహితులు కూడా ఆమె పక్కన ఉండొచ్చు.

5 అజ్ఞాతం.. మీ హక్క

లైంగిక వేధింపులకు గురైన మహిళలకు.. ‘గోప్యత హక్కు’ ఉంటుంది. దీని ప్రకారం.. బాధితురాలి పేరు, ఇతర వివరాలను బయటికి వెల్లడించకూడదు. మేజిస్ట్రేట్‌ ఎదుట ఒంటరిగా లేదా మహిళా పోలీసు అధికారి సమక్షంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకునే హక్కు బాధితురాలికి ఉంటుంది.

6 ఉచిత న్యాయ సేవ

లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీస్‌ యాక్ట్‌.. అత్యాచార బాధితులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తుంది. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు న్యాయ సహాయం పొందడానికి ఈ చట్టం హామీ ఇస్తుంది.

7 గౌరవానికి భంగం వద్దు!

లైంగిక వేధింపుల బాధితురాలికి.. తన గౌరవానికి భంగం కలగకుండా చూసుకొనే హక్కు ఉంటుంది. దీని ప్రకారం.. ఏదైనా వైద్య పరీక్షలు అవసరమైతే కేవలం మహిళా వైద్యురాలి ద్వారానే పరీక్షలు నిర్వహించాలి. ఇతరుల సమక్షంలో ఏ విధమైన శారీరక/ మానసిక పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధం.


bottom of page