ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2025) సీజన్-18లో గణనీయమైన మార్పులు కనబడనున్నాయి. ఫ్యాన్స్‌కు మరింత కిక్కిచ్చేలా.. మ్యాచ్‌ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. అంటే వచ్చే ఐపీఎల్ టోర్నీలో మొత్తం 84 మ్యాచ్‌లు జరగనున్నాయి. వాస్తవానికి ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌లతో కలిపి మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే రానున్న సీజన్లలో అదనంగా మరో 10 మ్యాచ్‌లు నిర్వహించడంపై బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేసింది. ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో మొత్తంగా 84 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.
అలాగే, ఐపీఎల్ 2027లో ఈ మ్యాచ్‌ల సంఖ్యను 94కి పెంచనున్నారు. దీంతో 2027లో లీగ్ ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది. ప్రస్తుతం ఐపీఎల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2021లో మొత్తం 60 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 56 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో, ప్రతి జట్టు ఇతర జట్లతో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడింది. దీని ద్వారా, లీగ్‌లోని అన్ని జట్లు ఒకదానితో ఒకటి 2 మ్యాచ్‌ల మాదిరిగా 14 మ్యాచ్‌లు ఆడాయి. అయితే 2022 నుంచి ఐపీఎల్‌ను రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఫార్మాట్ IPL 2025, 2026లో కూడా కొనసాగనుంది.
ఐపీఎల్ 2027 సీజన్‌ను లీగ్ ప్రాతిపదికన నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. అంటే అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడతాయి. దీని ద్వారా లీగ్ దశలోనే 90 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం మ్యాచ్‌ల సంఖ్యను పెంచడంపై బీసీసీఐ చర్చలు జరుపుతుండగా, తుది నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం ఉంది. అయితే రానున్న సీజన్లలో ప్లేఆఫ్స్ విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం తొలి క్వాలిఫయర్ మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.