top of page
Suresh D

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో హై అలర్ట్..🚨

ఇటీవలే ఛత్తీస్ గఢ్‎లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‎కు నిరసనగా మావోయిస్టులు ఐదు రాష్ట్రాల బంద్‎కు పిలుపునిచ్చారు. కచ్చితంగా నెత్తుటి బాకీ తీర్చుకుంటామని హెచ్చరించారు.

నేడు మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వారం రోజుల క్రితం ఛత్తీస్ గఢ్‎ – తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోయిస్టు పార్టీ ముఖ్యనేతలు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్‎ను ఖండిస్తూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు ఏకపక్షంగా కాల్పులు జరిపి మావోయిస్టులను మట్టుబెట్టారని ఆరోపించిన మావోలు ఈ ఎన్ కౌటర్‎కు నిరసనగా ఐదు రాష్ట్రాల బంద్‎కు పిలుపునిచ్చారు. ఛత్తీస్ గఢ్‎, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో బంద్ పాటించి మావోయిస్టు అమరవీరులకు మద్దతు తెలపాలని కోరారు. ఏజెన్సీలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టులు ఐదు రాష్ట్రాల బందుకు పిలుపునివ్వడంతో టెన్షన్ వాతావరణ నెలకొంది. మావోయిస్టుల ఎన్‎కౌంటర్‎కి ప్రతీకారం తీర్చుకుంటామని, ప్రతీకార చర్య తప్పదని పోలీసులకు సవాల్ చేస్తూ లేక విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాలైన వెంకటాపురం, వాజేడు, కాళేశ్వరం, మహాదేవాపూర్, పలిమెల మండలాలతో పాటు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల, దుమ్మగూడెం మండలాల్లో పోలీసులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎన్‎కౌంటర్‎కు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొనడంతో పోలీసులు మరింత అప్రమత్తమైనట్టు తెలుస్తుంది.

bottom of page