top of page

తెలంగాణలో 3.28కోట్ల ఓటర్లు.. 22 వరకు అభ్యంతరాల స్వీకరణ

తెలంగాణలో మొత్తం 3,28,29,498 ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా జాబితాలో ప్రకటించారు. ఈ నెల 22వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

తెలంగాణలో ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3.28కోట్ల ఓటర్లలో 1,64,01,046 మంది పురుష ఓటర్లు, 1,64,25,784 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 2,668 మంది ఉన్నారని ప్రకటించింది.

ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలతొో పోలిస్తే కొత్తగా మరో ఆరు లక్షల మంది ఓటర్లు పెరిగారు. సార్వత్రిక ఎన్నికల్లో 35,356 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 2024 జనవరి 1 నాటికి 18 ఏండ్ల వయస్సు నిండిన వారికి డిసెంబర్‌ 20 నుంచి జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల కోసం మొత్తం 11,99,850 దరఖాస్తులు వచ్చాయి.

ఇందులో కొత్తగా ఓటు కోసం 7,69,048 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓటు తొలగింపు కోసం 2,90,123 మంది, చిరునామా మార్పు కోసం 1,40,679 మంది దరఖాస్తు చేసినట్లు వివరించారు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ముసాయిదా జాబితాను ప్రచురించారు.

ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 22వ తేదీలోగా తెలుపవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది. అభ్యంతరాలను తెలిపేందుకు తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 20, 21వ తేదీల్లో ప్రత్యేకంగా బూత్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాల వద్దే ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను అక్కడే తెలుపవచ్చని, జాబితాపై వచ్చే అభ్యంతరాలను స్వీకరించి, అభ్యంతరాలను ఫిబ్రవరి 2వ తేదీలోగా పరిష్కరించనున్నట్టు వెల్లడించారు. ఫిబ్రవరి 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని, ఓటర్లు తమ ఓటు జాబితాలో ఉందో లేదో మరోసారి సరిచూసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచించారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page