top of page

అప్పుడు రాళ్లతో కొట్టమని.. ఇప్పుడు నీతిమాలిన పని!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు.. సీఎం అయిన తర్వాత చేసే పనులకు పొంతనలేదన్నారు. ఏ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే.. రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అందుకు జవాబు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఎన్నికల ప్రచారంలో నీతులు? ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్ వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరడం నేరమని, ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమని, భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమని నాడు రేవంత్ అన్నారని గుర్తు చేశారు.

చివరికి ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమని, రాజీనామా చేయకుండా చేరితే ఊళ్ల నుంచే తరిమికొట్టమన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు. అలా అన్నవారే ఇవాళ బీఆర్ఎస్​ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా? అని రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు.

జంప్ జిలానీల భరతం పడతా అని భారీ డైలాగులు కొట్టి, ఏ ప్రలోభాలను ఎర వేస్తున్నారని, ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రిని కేటీఆర్ నిలదీశారు. ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని? రాజకీయంగా గోరి కట్టాల్సింది ఎవరికి? అంటూ ప్రశ్నించారు. మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించిన విషయంతెలిసిందే.

రాహుల్ గాంధీ ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని, ఫిరాయించిన ప్రజా ప్రతినిధులను స్వయంచాలకంగా అనర్హులుగా ప్రకటించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరిస్తామని పెద్ద ఎత్తున ప్రసంగించారు. అదే రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

bottom of page