top of page

ఏకకాలంలో రైతు 'రుణమాఫీ'..! సర్కార్ ఆలోచన ఇదేనా..?

రైతు రుణమాఫీపై కసరత్తు చేసే పనిలో పడింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా… ఏకకాలంలో రుణాలను మాఫీ చేయటంపై దృష్టి పెట్టింది. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్. అయితే అధికారంలోకి రావటంతో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలపైనే కాకుండా... రైతు రుణాలపై స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే... రాష్ట్రంలో ఉన్న రైతు రుణాలపై దృష్టిపెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఏకకాలంలో రుణాలను మాఫీ చేయాలని భావిస్తోంది. అందుకు తగ్గటే... సరికొత్త కార్యాచరణతో ముందుకువచ్చే పనిలో పడింది. 

రాష్ట్రంలో ఉన్న రైతు రుణాల మాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే విషయంపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ. 32వేల కోట్ల పంట రుణాలను క్లియర్ చేయాలని చూస్తోంది. ఇదే విషయంపై బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతోంది. ఒకే సారి ఏకకాకంలో రుణాలన్నీ మాఫీ చేయాలని బ్యాంకులను కోరినట్లు తెలిసింది. ఈ డబ్బులను ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఈఎంఐ పద్ధతిలో చెల్లిస్తామని బ్యాంకుల ముందు ప్రతిపాదన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ కార్పొరేషన్ కు రిజిస్ట్రేషన్లు, స్టాంపులు,వాణిజ్య పన్నులతో పాటు ఇతర శాఖల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని మళ్లించాలని చూస్తోంది. ఫలితంగా ప్రతి నెలా... ఈఎంఐ పద్ధతిలో బ్యాంకులకు డబ్బులను చెల్లించవచ్చని లెక్కలు వేస్తోంది ప్రభుత్వం. ఇక ఇదే రుణమాఫీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ కూడా కనిపించింది. రాష్ట్రంలో ఉన్న 32 వేల కోట్ల రైతురుణాలను ప్రభుత్వం మాఫీ చేయబోతుందని… ఇందుకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు కాబోతుంది తెలిపింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా... రైతు రుణమాఫీ ప్రకటనపై ఏబీఎన్ తెలుగు టీవీ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కూడా స్పందించారు. రుణమాఫీ విషయంలో తమ ప్రభుత్వానికి స్పష్టత ఉందని చెప్పారు. ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసే విషయంపై ఆలోచిస్తున్నామని... దాని ద్వారా బ్యాంకర్లకు చెల్లిస్తామని పేర్కొన్నారు. రైతులకు మాత్రం ఏకకాకంలో రుణమాఫీ చేస్తామని, ఇచ్చిన మాటను నిలుపుకుంటామని చెప్పారు.

ఇక రైతు రుణమాఫీ విషయంలో కటాఫ్ తేదీ అనేది చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం… ఏ తేదీని కటాఫ్ గా నిర్ణయిస్తుందనేది చాలా ముఖ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఉన్న రుణాలను మాఫీ చేస్తుందా…? లేక ఇంకా వేరే ఏదైనా తేదీని ప్రమాణికంగా తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంటుంది…! మొత్తంగా చూస్తే… ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టుగా కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటన వస్తే… ఆ వెంటనే రైతు రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది…!


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page