top of page

వచ్చేయ్ ఆ మాట‌లు మేం ప‌ట్టించుకోం!

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు లేరు.. శాశ్వ‌త మిత్రులు కూడా లేరు.

అవ‌కాశం-అవ‌స‌రం ఈ రెండు చాలు. నాయ‌కులు, పార్టీలు కూడా.. స‌ర్దుకు పోతాయి. ఇప్పుడు తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం బీఆర్ఎస్‌లోనూ ఇదే జ‌రుగుతోంది.

రెండు నెల‌ల కింద‌ట మాజీ మంత్రి , అగ్ర‌నేత కేటీఆర్‌ను తిట్టిపోసిన నాయ‌కుడికి ఇప్పుడు బీఆర్ఎస్ తిరిగి చేర్చుకునేందుకు రెడీ అయింది. దీంతో అంద‌రూ అవాక్క‌వుతున్నారు. ఎస్సీల‌కు విలువ లేదు. కేటీఆర్ మాయ‌లోడు. క‌నీసం నాకు విలువ ఇవ్వ‌కుండా దూషించాడు. అనేక అవ‌మానాలు చేశాడు. అందుకే పార్టీలో ఉండలేక పోతున్నా. రాజీనామా చేస్తున్నా అంటూ రెండు మాసాల కింద‌ట సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి.. బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ డిప్యూటీ సీఎం, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య‌కు మ‌రోసారి బీఆర్ఎస్ నుంచి పిలుపు వ‌చ్చింది. వచ్చేయ్ ఆ మాట‌లు మేం ప‌ట్టించుకోం అంటూ.. బీఆర్ఎస్ నుంచి రాజయ్య‌కు ఆహ్వానం అందింది. దీంతో రాజ‌య్య కూడా.. బీఆర్ఎస్ కండువా క‌ప్పుకొనేందుకు రెడీ అయిపోయారు. ఏం జ‌రిగింది?

బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగిన రాజయ్య 2 నెలల కిందట బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీని వీడారు. అయితే రాజయ్య కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైనప్పటికీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈలోపు రాజ‌య్య‌కు రాజ‌కీయ శ‌త్రువు, సొంత నియోజ‌క‌వ‌ర్గం నేత కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతుండడంతో ఇక రాజయ్య చేరిక కష్టంగా మారింది. మ‌రోవైపు, బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ పార్లమెంటుకు అభ్యర్థులు కరువు కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం తాటికొండ రాజయ్యను పార్టీలోకి ఆహ్వానించింది. పార్టీ అధినేత, ముఖ్య నేతలు రాజయ్యకు ఫోన్ చేసి పార్టీలోకి పిలవడంతోపాటు వరంగల్ పార్లమెంటు టికెట్ కేటాయిస్తామని రాజయ్యతో చర్చించినట్లు సమాచారం. అందుకు రాజయ్య సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

bottom of page