రాజధాని నగరంలో ఓటర్ల సంఖ్య కోటి దాటింది. రాష్ట్రం మొత్తం మీద 3.17 కోట్ల మంది మంది ఓటర్లు ఉండగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 1.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని 76 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల కంటేఎక్కువగా ఉంది.
తెలంగాణలో 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు ఈసీ ఓటర్ల జాబితాను బుధవారం (అక్టోబర్ 4న) విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 1,58,71,493 మంది పురుషులు కాగా.. 1,58,43,339 మంది మహిళలు ఉన్నారు. 2,557 మంది థర్డ్ జండర్ ఓటర్లు ఉన్నారు. 6,93,133 మంది ఓటర్లతో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా శేరిలింగంపల్లి గుర్తింపు పొందింది. 1,46,016 ఓట్లు ఉన్న భద్రాచలం అతి తక్కువ మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా నిలిచింది.
హైదరాబాద్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఓటర్ల సంఖ్య 44.42 లక్షలు దాటింది. హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 28 నియోజకవర్గాలు, సంగారెడ్డి జిల్లాలోని పఠాన్‌చెరు నియోజకవర్గాన్ని పరిగణనలోకి తీసుకుంటే రాజధాని నగరంలో ఓటర్ల సంఖ్య కోటి దాటింది. ఈ 29 సెగ్మెంట్లలో ఓటర్ల సంఖ్య దాదాపు 1.09 లక్షలు కావడం గమనార్హం. మేడ్చల్ జిల్లాలో 26,91,167 మంది ఓటర్లు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 33,55,274 మంది ఓటర్లు ఉన్నారు. పఠాన్ చెరు నియోజకవర్గంలో 3.80 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా.. ఈ 29 నియోజకవర్గాల్లోనే మూడొంతుల మంది ఓటర్లు ఉన్నారు.
తెలంగాణలోని మెజార్టీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 76 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. 33 జిల్లాలకు గానూ 26 జిల్లాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం. మంచిర్యాల, కుమురం భీమ్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సిద్ధిపేట, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్, గద్వాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, భద్రాద్రిచ ఖమ్మం, ములుగు, నారాయణపేట జిల్లాల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు.
రాష్ట్రంలోని ఓటర్లలో 4.43 లక్షల మంది 80 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. 7.66 లక్షల ఇళ్లలో ఆరు కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ ఇళ్లలో 75.97 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత రెండేళ్లలో వివిధ కారణాలతో 22.02 లక్షల ఓట్లను తొలగించారు.