top of page
MediaFx

ఎన్డీయేలో కొనసాగే విషయంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అఖండ విజయాన్ని అందించినందుకు రాష్ట్ర ప్రజలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం తరువాత తొలిసారి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు శిరస్సు వంచి ధన్యావాదాలు చెప్పారు. గత ఐదేళ్లల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు. అన్ని వ్యవస్ధలను ధ్వంసం చేశారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలనే నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లామ‌ని చంద్ర‌బాబు అన్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి.. ఏదీ శాశ్వతం కాదు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వ్యక్తులు, రాజకీయ పార్టీలు కనుమరుగు అవుతాయి. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు.. కూలీ పనులు చేసుకునే వాళ్లు కష్టంతో వచ్చి ఓటేశారు. టీడీపీ చరిత్రలో.. ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు ఇవి అని చంద్ర‌బాబు అన్నారు.

ప్రజలు గుణపాఠం నేర్పించారు..1984, 1994ను మించిన స్థాయిలో ఇప్పుడు ప్రజ‌ల‌ నుంచి రియాక్షన్ వచ్చింది. ప్రజలు స్వేచ్ఛని కొల్పోయారు. అందరం కలిశాం.. ఎన్నికల్లో పోటీ చేశాం. కంచుకోటలు బద్దలు చేశాం.. మెజార్టీలు పెద్ద ఎత్తున వచ్చాయ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఈ ఎన్నికలను ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కావడం లేదు. అహకారం, నియంతృత్వం, విచ్చలవిడితత్వం వంటివి ప్రజలు సహించరు.. ప్రజలు గుణపాఠం నేర్పించారని చంద్ర‌బాబు అన్నారు. ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. నిద్రలేని రాత్రులు గడిపాం. జై జగన్ అనకుంటే చంపేస్తామన్నా.. లెక్క చేయకుండా జై తెలుగుదేశం అని నినాదాలు చేసిన చంద్రయ్య లాంటి కార్యకర్తలను ఎలా మరువగలం. పవనుకు స్వేచ్ఛ లేకుండా చేశారు. విశాఖలో ఉండొద్దని పవన్ను నగర బహిష్కరణ చేసిన పరిస్థితి. అరెస్ట్ చేసిన తర్వాత విషయాలు చెబుతామని చెప్పిన పరిస్థితులు గ‌త ఐదేళ్ల‌లో చూశాం.

మేం పాలకులం కాదు సేవకులం..మేం పాలకులం కాదు సేవకులం. మాకొచ్చింది అధికారం కాదు.. బాధ్యత. మేనిఫెస్టో.. సూపర్ సిక్స్ వంటివి ప్రజల్లోకి వెళ్లాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ ముందుకొచ్చారు. పవనే కూటమికి బీజం వేశారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలు బేషజాలకు పోకుండా కలిసి పని చేశామ‌ని చంద్ర‌బాబు అన్నారు.

30ఏళ్ల వెన‌క్కు వెళ్లాం..ఐదేళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్ల వెనక్కు వెళ్లేలా డామేజ్ జరింగింది. అప్పులు ఎంతున్నాయో చూడాలి. సహజ సంపద దోపిడీ యధేచ్ఛగా జరిగింది. వ్యవస్థలన్నింటినీ పునరుద్దరించాల్సి ఉంటుంది. నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. గతంలో కరెంట్ సంక్షోభం ఉండేది.. సంస్కరణలు తెచ్చి గాడిలో పెట్టాం. ఇప్పుడు మళ్లీ విద్యుత్ సంక్షోభం ఉంది. గత ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది. ఎందుకు పెంచారో కూడా తెలీదు. ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు.. గెలిచినప్పుడు గంతులేయలేదు. ఓటేశాం.. మా పని అయిపోయిందని ప్రజలు భావించవద్దు. మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని కోరుతున్నాన‌ని చంద్ర‌బాబు అన్నారు.

చెప్పినట్టుగా గెలిచి అసెంబ్లీకి వెళ్తున్నాం..అసెంబ్లీలో నాకు, నా కుటుంబానికి జరిగిన అవమానం మర్చిపోలేనిది. నాపై బాంబులు వేసిన రోజుకూడా నేను భయపడలేదు. అలాంటి వ్యక్తిని.. అసెంబ్లీలో జరిగిన సంఘటనతో ఇలాంటి కౌరవ సభలో ఉండలేనని చెప్పి బయటకు వచ్చా. మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచి అసెంబ్లీలోకి వస్తానని శబథం చేశా. నాకు ప్రజలు అండగా నిలబడి మరోసారి అసెంబ్లీకి పంపించారు. నా గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరుణం తీర్చుకుంటాం. మీ అంచనాల ప్రకారం పనిచేస్తామని చంద్రబాబు అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అగ్రనాయకత్వం నరేంద్ర మోదీ, అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరం, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు కలిసిముందుకు సాగారు. ఈ విజయం బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తల సమిష్టి కృషి అని చంద్రబాబు అన్నారు.

మేం ఎన్డీఏలో ఉన్నాం.ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నాం. పాలకుడు ఎలా ఉండాలో చాలా మంది నేతలు చేసి చూపించారు. పాలకుడనే వాడు ఎలా ఉండకూడదో జగన్ చూపించాడు. జగన్ ను ఓడించడమే కాదు.. రాజకీయాలకే వద్దని ప్రజలు ఓటేశారు.

bottom of page