2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 7 లక్షల కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉండగా.. అదే సమయానికి లక్ష కోట్ల డాలర్లకు చేరాలని తమిళనాడు లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో ఆ రాష్ట్రం నంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంది.
తమిళనాడు ఏంటి.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇప్పుడు కాదులేగానీ.. మరో ఏడేళ్లలో వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అవతరించాలని తమిళనాడు లక్ష్యంగా పెట్టుకుంది. టార్గెట్ పెట్టుకోవడానికి ఏముంది.. ఆచరణలో సాధ్యం కావాలి కదా..? అని అనుకుంటున్నారా..? తమిళనాడులోని స్టాలిన్ సర్కారు అడుగులు మాత్రం ఆ దిశగానే పడుతున్నాయి. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో తమిళనాడు అగ్రస్థానానికి చేరుకుంది. 2020-21లో తమిళనాడు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.13,641 కోట్లు కాగా.. 2022-23లో అది రూ.44 వేల కోట్లు దాటింది. ఈ రెండేళ్లలో తమ రాష్ట్రం నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 223 శాతం మేర పెరిగాయని తమిళనాడు సర్కారు చెబుతోంది. ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నామని చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఇందులో భాగంగానే.. 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులేస్తున్నామని చెప్పుకుంది. మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తమిళనాడు..
ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 3.75 లక్షల ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి ఇది 7 లక్షల ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 35 శాతంగా ఉంటుందనే అంచనాలున్నాయి. అప్పటికి తమ ఆర్థిక వ్యవస్థను లక్ష కోట్ల డాలర్లకు చేర్చాలని తమిళనాడు లక్ష్యంగా పెట్టుకుంది. పలు మల్టీ నేషనల్ కంపెనీలు తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను చైనా వెలుపలకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తుండగా... భారత్ వాటిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. వాటిల్లో ఎక్కువ యూనిట్లను తమిళనాడు ఆకర్షించే అవకాశం ఉంది. సుదీర్ఘ సముద్ర తీరం, చెన్నై పోర్టు, ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండటం, మానవ వనరుల లభ్యత తమకు కలిసి వస్తుందని తమిళనాడు ధీమాతో ఉంది.
జీఎస్‌డీపీ.. సౌత్‌లో తమిళనాడు ఫస్ట్..
దక్షిణాదిలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తమిళనాడు ఉండగా... తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు జీఎస్‌డీపీ రూ.24.8 లక్ష కోట్లు కాగా.. కర్ణాటక జీఎస్‌డీపీ రూ.22.4 లక్షల కోట్లుగా ఉంది. తెలంగాణ జీఎస్‌డీపీ రూ.13.3 లక్షల కోట్లు కాగా.. ఏపీ జీఎస్‌డీపీ రూ.13.2 లక్షల కోట్లు, కేరళది రూ.10 లక్షల కోట్లు. ఏపీ, తెలంగాణ కలిపి చూస్తే.. రూ.26.5 లక్షల కోట్లు. ఏపీ విడిపోవడం వల్ల దక్షిణాదిలో తమిళనాడు ఆర్థిక వ్యవస్థ మరింత పెద్దదిగా కనిపిస్తుందనేది వాస్తవం. 2030 నాటికి లక్ష్యాన్ని చేరుకున్నా, చేరుకోలేకపోయినా.. లక్ష ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే తొలి లేదా రెండో దక్షిణాది రాష్ట్రంగా తమిళనాడు నిలిచే అవకాశం ఉంది. తెలుగువాళ్లమైన మనం విడిపోయి ఎదుగుతున్నామని పైనున్న గణాంకాలు చెబుతున్నాయి. మన పొరుగున ఉన్న తమిళులు, కన్నడిగులు మాత్రం.. విడిపోకుండానే మనకంటే మెరుగ్గా ఎదుగుతున్నారు. ఏపీ విభజన సమయంలో తమిళనాడుకు చెందిన రాజకీయ నేతలు తెర వెనుక రాజకీయం నడిపారని, రాష్ట్ర విభజనకు తమవంతు ప్రయత్నించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇదెంత వరకు వాస్తవమో తెలీదు గానీ.. ఏపీ విడిపోవడంతో.. దక్షిణాదిలో పెద్దన్న హోదా తమిళనాడుకు దక్కిందనే మాత్రం వాస్తవం.
లక్ష కోట్ల డాలర్లు అంత తేలికా..?
ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉండగా.. 20 దేశాలు కూడా లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోలేదు. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే సమయానికి ఇండియా ఎకానమీ 274 బిలియన్ డాలర్లు మాత్రమే. ఆర్థిక సంస్కరణాల తర్వాత భారత వృద్ధి వేగం పుంజుకుంది. ఇండియా 2007లో వన్ ట్రిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది. 2014లో 2 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ 9 ఏళ్లలో దాదాపు రెట్టింపయ్యి 3.75 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. మరో ఏడేళ్లలో ఇది రెట్టింపు అయితే.. ఇండియా ఎకానమీ 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుంది. అదే సమయంలో తమిళనాడు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉంది. 2027 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని ఉత్తర ప్రదేశ్, కర్ణాటక లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మహారాష్ట్ర 2030 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవతరించాలని టార్గెట్‌గా పెట్టుకుంది.