వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదిరించాలంటే ప్రతిపక్ష పార్టీలకు సైద్ధాంతిక(సిద్ధాంతాలకు) విలువలు ఉండటం అవసరం అని సిపిఐ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ ,మాజీ ఎంపీ శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఆయన ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం లో వచ్చే ఎన్నికల ప్రణాళికలు , ప్రతిపక్షాలు అవలంభించాల్సిన వైఖరి గురించి ,బీజేపీని ఎదుర్కొనే విధానాల గురించి ప్రస్తావించారు.
ప్రతిపక్షాలు కేవలం సైద్ధాంతిక పరంగా ఉంటే సరిపోదని , అవసరమైన చోట పొత్తులు పెట్టుకుంటేనే బలమైన బీజేపీ ని ఎదుర్కోవచ్చని ఆయన సూచించారు. దీనికి ఆయన ప్రత్యేక విశ్లేషణ చేసారు. జమ్మూ కాశ్మీర్ లో ముఫ్తి ఇంకా ఫారూఖ్ అబ్దుల్లా కలిస్తే గెలిచే అవకాశం ఉందని ఆయన అన్నారు . అలాగే పంజాబ్ ఢిల్లీలలో ఆమ్ ఆద్మీ ,కాంగ్రెస్ కలవటం వల్ల బీజేపీ ని ఓడించవచ్చు అని అభిప్రాయ పడ్డారు. యూపీ లాంటి పెద్ద స్టేట్ లో అఖిలేష్ యాదవ్ లాంటి వారు సందేహపడకుండా 3% శాతం తక్కువ ఓటర్లు ఉన్న కాంగ్రెస్ ని కలుపుకోవాలి ,అలాగే మాయావతిని కూడా అని ఆయన చెప్పారు . గతంలో బీజేపి కేవలం 0.1% ఓటర్లు ఉన్న పార్టీలను కలుపుకొని NDA అలయన్స్ ద్వారా ఎలా గెలిచిందో గుర్తుచేసారు. ఇక బెంగాల్ లో మమతా వైఖరి మారాలన్నారు. కమ్యూనిస్ట్ పార్టీల పై చేసిన దాడుల వల్ల అక్కడ మైత్రి కష్టమన్నారు ఆయన. ఇక దక్షిణాదిలో కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్ సిబిఐ కేసులకు బయపడి ఒక అవకాశవాదిలా మారి కేంద్రం లో బీజేపి కి మద్దతు ఇస్తున్నారు అని ఆయన మాట్లాడారు. తమిళనాడు , కర్ణాటక లో ప్రతిపక్షాలు పదవి వ్యామోహం తో బీజేపి కి పొత్తు ఇవ్వనున్నాయని తెలిపారు. ఇక కేరళ లో కాంగ్రెస్ , సిపిఐ మధ్యనే పోటీ , కానీ తెలంగాణాలో త్రిముఖ పోటీ నడవనుందని తెలిపారు . బీజేపీ కాంగ్రెస్ లకు తక్కువ అవకాశం ఉన్నా కూడా ఓట్లు చీల్చే ప్రయత్నం జరుగవచ్చు అన్నారాయన. ఎంఐఎం పార్టీ కూడా పరోక్షంగా వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టి ఓట్లను చీల్చి బీజేపీ కి సహకరిస్తున్నారని సురవరం వివరించారు. అందుకే వాళ్ళ మీద ఐటీ దాడులు జరుగటం లేదని ఆరోపించారు.