top of page
MediaFx

సురవరం కథల్లో స్త్రీ పాత్రల ఔచిత్యం

సురవరం ప్రతాపరెడ్డి ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథానికలు, కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, సాహిత్య విమర్శ వంటివి రాయడమే కాకుండా అందరినీ ప్రోత్సహించారు. ముఖ్యంగా ఆయన వచన రచనకు ఒరవడి పెట్టిన మహానుభావులు. ‘చిత్రగుప్త’, ‘భావకవి రామ్మూర్తి’, ‘యుగపతి’ ‘సింహ’ వంటి కలం పేర్లతో సురవరం రచనలు చేసేవారు. ‘గోలకొండ’, ‘సుజాత’ పత్రికల్లో విరివిగా వీరి రచనలు ప్రచురితమయ్యేవి.

సురవరం రచించిన 24 కథల్లో ‘మొగలాయి కథలు’ పేరుతో 11 కథలున్నాయి. 1940లో అణా గ్రంథమాల వారు మొట్టమొదట వీటిని అచ్చు వేశారు. 1938లో గుండవరం హన్మంతరావు, కేసీ గుప్తా, వెల్దుర్తి మాణిక్యరావు గార్లు అణా గ్రంథమాలను స్థాపించి తెలుగుభాషకు ఎనలేని సేవ చేశారు. మొగలాయి పాలన కాలం నుంచి ప్రజల్లో వ్యాప్తిలో ఉన్న విషయాలను ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనుకబడిన నాటి తెలంగాణ ప్రాంతంలోని జీవనవ్యవస్థను చిత్రించారు సురవరం. ఆయన రాసిన కథల్లో ‘హుస్సేన్‌ బీ’, ‘మెహ్దీబేగమ్‌’, ‘ఖిస్మత్‌’, ‘అపరాధం’, ‘వింత విడాకులు’, ‘సంఘాల పంతులు’,‘ వకీలు వెంకయ్య’, ‘బారాకద్దూ గ్యారా కొత్త్వాల్‌’, ‘గోమాజీ’ వంటివి గొప్ప కథలు.అధికారంలో ఉన్నవారు ప్రజలను ఎట్లా పరిపాలిస్తారు? కొందరికి మోసగించే చాతుర్యం ఎట్లా ఉంటుంది? అలసత్వమూ, లంచగొండితనం, గుడ్డిన్యాయం వంటివి కథల్లో చూపుతూనే, ప్రజల అమాయకత్వమూ, నిస్సహాయతను కూడా చిత్రించారీ కథల్లో. అందుకేనేమో సురవరం వారి ఈ కథలు సామాజిక సందర్భాన్ని కోల్పోలేదు.‘గ్యారా కద్దూ బారా కొత్వాల్‌’ కథలో ఒక పేద రైతు తన చెల్కలో కాసిన పదకొండు ఆనపకాయలను అంగట్లో అమ్ముదామనుకుంటే మొదట మాలీ పటేల్‌, తర్వాత ఇతర అధికారులూ ఒక్కొక్కరూ తలా ఒకటి తీసుకొనిపోతారు. ఇలా దోపిడీకి గురైన రైతు ఏడ్చి ఊరుకోక తన భార్య వంకీని అమ్మి మంచి షేర్వానీ కుట్టించుకొని కొంతమంది లంచగొండి సేవకులను తనవారిగా చేసుకొని తన బావి దగ్గరకు వచ్చేవాళ్ల దగ్గర కుండకు పైస చొప్పున వసూలు చేస్తుంటాడు. బేగంల దగ్గర డబ్బులు తీసుకొని గంటలు కొడ్తుంటాడు. నవాబు ఇది గ్రహించి, ఈ రైతు చలాకీతనానికి సంతసించి ఓ గ్రామాన్నే ‘ఇనాం’గా ఇస్తాడు. ఒక అమాయకుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఇలా అయ్యాడో చెప్పే ఈ కథ ‘యథా రాజా తథా ప్రజా’ అన్నది రుజువు చేస్తుంది. ఇంచుమించు ఇటువంటిదే ‘గోమాజీ’ కథ. ‘బేఖూన్‌ మరాక్‌ సాబ్‌’, ‘కిచిడీ జాగీర్దారు’, ‘చస్తామంటే పురంసతం లేదు’, ‘రుమాలును బర్రె తినిపోయింది’ వంటి మొగలాయి కథలు రూపొందాయి. ఇవి 1940వ దశకంలో నాటి ‘సుజాత’ పత్రికలో ప్రచురితమయ్యాయి.‘హుస్సేన్‌ బీ’ అనే కథలో కామాక్షి అనే స్త్రీ స్వామీజీ రూపంలో ఉన్న ఒక మోసగాడి చేతిలో మోసపోతుంది. ఆమెను తల్లిదండ్రులు నిరాకరిస్తారు. అనుకొని పరిస్థితుల్లో సాహెబును పెళ్లి చేసుకుంటుంది. హుస్సేన్‌ బీగా మారుతుంది. నిరాశ్రయులైన స్త్రీలు ఎట్లాంటి పరిస్థితుల్లో దిక్కుతోచక ఇతర మతాలకు ఎలా పోతారో చూపిన కథ ఇది.‘మెహ్దీ బేగమ్‌’ కథలో మెహెదీ సంపన్న కుటుంబీకురాలు. నౌకరు ప్రేమలో పడుతుంది. ఇద్దరూ కలిసి పారిపోతారు. కొన్నాళ్లకు ఈమెను వదిలేసి అతను పారిపోతాడు. ఆమెను కొందరు స్త్రీలు వేశ్యా గృహంలో చేరుస్తారు. నిస్సహాయతతో స్త్రీలు ఇలాంటి ఉచ్చుల్లో ఎలా పడిపోతారో వివరించే కథ ఇది. ఈ కథలో హిందూ ముస్లింల సఖ్యతను చూపటం విశేషం.చిన్ననాడు తప్పిపోయిన ఒక పిల్ల, యుక్త వయస్సు వచ్చాక వేశ్యావృత్తిలోకి ఎట్లా తోసివేయబడింది, ఆమె కళాకారిణి కాబట్టి డబ్బు లాభాపేక్షతో ఎట్లా హింసిస్తారో చిత్రించిన కథ ‘ఖిస్మత్‌’. లాహోర్‌లో వేశ్యావృత్తితో జీవించే గోహర్‌ జాన్‌ ఇతివృత్తంతో సాగిన కథ ఇది. తన ఆస్తినంతా అనాథ బాలికకు రాసిచ్చింది. మరణించిన తర్వాత ఆమె సమాధిపైన అనాథలు గులాబీపూలు పెట్టి కన్నీరు కారుస్తారని ముగించడంతో ఈ కథ నామౌచిత్యాన్ని సంతరించుకున్నది.‘వింత విడాకులు’ కథ హిందూమతంలో విడాకులిచ్చే చట్టం లేకపోవటంతో కమలమ్మ అనే స్త్రీ పెళ్లితో ముస్లిం అయి, విడాకులు తీసుకున్నట్టు రచించారు. నంబి నర్సిమ్ములు మనోవేదన, హుసేనప్ప, మల్లమ్మల ఆలోచనలు ఈ కథలో మిళితమైపోయి ఉంటాయి.సురవరం వారి కథలు ప్రజాజీవన విధానాన్ని వాస్తవిక కోణంలో ఆవిష్కరిస్తాయి. గొప్ప కథా శిల్పంతో, చక్కని సన్నివేశ కల్పనలతో, సహజమైన పాత్ర చిత్రణలతో ఉన్న ఈ కథలు నేటికీ చదివిస్తాయి.సమకాలీన పరిస్థితులకు చిత్రిక పట్టడం, సంస్కృతీ సంప్రదాయాలకు అక్షర రూపం ఇవ్వడం ఈ కథల్లో గమనిస్తాం. ‘హుస్సేన్‌ బీ’ కథలో కామాక్షి, ‘వింతవిడాకులు’ కథలో కమలమ్మ ఇద్దరూ తమను ఆదరించిన వారికోసం మత సంప్రదాయాలను ధిక్కరిస్తారు. సరళమైన సంభాషణా చాతుర్యంతో ఆకట్టుకుంటాయి. ఎక్కువ శాతం తెలంగాణ సామాజిక, రాజకీయ, నాటి ప్రభుత్వాంగాల పనితీరును రాశారు. భాషాపరంగా చూస్తే సురవరం కథలన్నీ తెలంగాణ నుడికారంతో, ప్రాంతీయ భాషా సౌరభంతో ఉన్నాయి.ప్రభుత్వ భాష ఉర్దూ ప్రభావం ప్రజలపై ఎట్లా పడిందో సురవరం కథలు చదివితే తెలుస్తుంది. వాపసు, జమా, ఖజానా, ఖాళీ, నౌకరి, జుమ్మా వంటి ఉర్దూ పదాలైనా, ఏరాలు, మనుం (పెండ్లి), పైకం, ఊర్కనే.. వంటి తెలంగాణ పల్లె పదాలైనా తెలంగాణ భాషకు అందాన్నిస్తాయి. ఓపుకోలేరు, కలబలుక్కోని, కంపగొట్టి లేచిపోతుందో, ఎట్లేగుతున్నావో.. వంటి ‘పలుకుబడులు’, ‘నానుడులు’ విరివిగా కనిపిస్తాయి.భూత దయ, అహింసా ధర్మాన్ని ఆచరించాలనే హిందూ సమాజం స్త్రీల విషయంలో ఎంత నిర్దయగా ఉన్నదో? ఎందుకున్నదో అనే బాధను వారి సంపాదకీయాల్లో రాసినట్టుగానే కథల్లోనూ రాశారు. బాల్య వివాహాలను ఘోర పిశాచానికి బలి చేసినట్లే అనడం వీరి ఔదార్యాన్ని తెలుపుతుంది. స్త్రీల అభ్యుదయం కోసం కృషి చేయడం లో మొదటగా బాల్య వివాహాలను రద్దు చేయాలని, విద్యార్జన సౌకర్యాలను ఒనగూర్చాలనీ సురవరం రాశారు.అనుమానాలు, అవమానాలు, శీలపరీక్షలు అన్నీ స్త్రీలకే ఉంటాయి. పురుషులకు ఎందుకు ఉండకూడదని సురవరం తన కథలద్వారా ఈ సమాజాన్ని నిలదీశారు. సురవరం ప్రతాపరెడ్డి స్త్రీ జనాభ్యుదయవాదిగా తన కథల్లో కనిపిస్తారు. సంఘసంస్కర్త, గొప్ప రచయిత, కవి, సంపాదకులు, పరిశోధకుడు అయిన సురవరం నవయుగ తెలంగాణ వైతాళికుడు.

వీరి కథల్లో ప్రేమ వివాహాలకు స్థానం కల్పించారు. వర్ణాంతర, మతాంతర వివాహాలకు స్థానం కల్పించారు. మత ఛాందసులు స్త్రీలను ఎక్కడైనా ఇబ్బందుల్లోనే పడేసేవారని ఈసడించుకున్నారు. ఇష్టం లేని భార్యలను వదలివేసే స్వేచ్ఛ, అధికారం మగవాళ్లకు ఉన్నట్లే, ఆడవారికి కూడా ఉండాలంటారు సురవరం. దీన్నిబట్టి సురవరం ఎంత ఆధునికుడో, స్త్రీవాదో తెలుస్తుంది. మనుధర్మ శాస్త్రంలో కూడా ఉన్మత్తుడు, నపుంసకునితో జరిగిన వివాహం రద్దవుతుందని ఉంది. కానీ మన చట్టాల్లో మాత్రం స్త్రీలకు ఈ హక్కును కల్పించలేదని, స్త్రీలకు అన్యాయం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు సురవరం.

bottom of page