top of page

టిడిపిని దెబ్బ తీసేందుకు పింఛన్లు నిలిపివేయబోతోందా?

చంద్రబాబు నాయుడుపై కక్ష, ద్వేషంతో రాజధాని అమరావతినే పాడుపెట్టినప్పుడు, త్వరలో జరుగబోయే ఎన్నికలలో టిడిపిని దెబ్బ తీసేందుకు వైసీపి అధినేతకు అవకాశం వస్తే వదులుకుంటారా?అంటే కాదనే చెప్పవచ్చు. దీని కోసం పింఛన్లు నిలిపి వేసే ఆలోచనలు చేస్తున్నట్లు కేశినేని నాని, మంత్రి బొత్స సత్యనారాయణ మాటల ద్వారా సంకేతాలు ఇచ్చిన్నట్లున్నారు. “జగన్మోహన్‌ రెడ్డి పేదలకు పింఛన్లు ఇస్తుంటే వాటికి కూడా చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారు. ఎన్నికల కమీషన్‌కి ఫిర్యాదు చేసి వాలంటీర్ల ద్వారా పింఛన్లు చెల్లించకూడదని ఆంక్షలు విధింపజేశారు. వాలంటీర్లు లేకపోతే ఇక వారికి పింఛన్లు ఎలా అందుతాయి? వారికి పింఛన్లు అందకుండా చంద్రబాబు నాయుడు ఎందుకు అడ్డుపడుతున్నారు?” అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఎన్నికల కమీషన్ ఉత్తర్వులలో చాలా స్పష్టంగా వాలంటీర్లకు బదులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్లు చెల్లించాలని పేర్కొందనే విషయాన్ని వైసీపిలో ఎవరూ చెప్పడం లేదు. వాలంటీర్ల ద్వారా పింఛన్ చెల్లించడానికి వీల్లేదని చెప్పిందని మాత్రమే చాటింపు వేస్తున్నారు. అంటే ప్రచారంలో ‘చంద్రబాబు నాయుడు అడ్డుపడటం వలననే తమ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వలేకపోయిందని’ వైసీపి ఎన్నికల చెప్పబోతున్నారన్న మాట! నేటితో మార్చి నెల ముగుస్తుంది. కనుక వైసీపి పద్దతి ప్రకారమే అయితే రేపు తెల్లవారుజాము నుంచే, అవ్వతాతా, అక్కా, వదిన అందరినీ నిద్రలేపి వారి చేతిలో పింఛను సొమ్ము పెట్టి వారి చేత ‘జగన్‌ తమకు మేలు చేస్తున్నారు’ అని అనిపించాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల కమీషన్ ఆదేశాన్ని ఉల్లంఘించి పింఛనులు చెల్లించి ఇబ్బందులు పడటం కంటే చెల్లించకుండా తప్పించుకొని లేదా అందరినీ తిప్పించుకుని టిడిపి, చంద్రబాబు నాయుడు అడ్డు పడటం వలననే పింఛన్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పుకునే అవకాశం జగన్‌ ప్రభుత్వానికి ఉంది. తద్వారా పింఛనుదారులందరికీ ఆందోళన, అసహనం, ఆగ్రహం కలిగితే ఏమవుతుందో వేరే చెప్పక్కరలేదు. ఇప్పటికే వైసీపి ఈ ప్లాన్ అమలు చేసేందుకు రెడీ అయిన్నట్లే కనిపిస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు అదే సూచిస్తున్నట్లున్నాయి. కనుక ఇప్పుడు అప్రమత్తం అవాల్సింది టిడిపి, జనసేనలే. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్న జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు దిగిపోయే ముందు పింఛన్లు కూడా ఎగవేసేందుకు ప్రయత్నిస్తోందనే బలమైన వాదనతో ముందుకు వెళ్ళి జగన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సకాలంలో అందరికీ పింఛన్లు ఇప్పించగలిగితే ఎన్నికలలో నష్టపోకుండా తప్పించుకోగలుగుతాయి.

bottom of page