'అఖండ' బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమా 'స్కంద' . రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ట్రైలర్లలో యాక్షన్ & ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించాయి. మరి, సినిమా ఎలా ఉందంటే ?🎥🎞️
కమర్షియల్ చిత్రాల్లో కుటుంబ విలువలు, మంచి విషయాలు చెప్పడం బోయపాటి శ్రీను శైలి. వెండితెరపై భారీతనం ఉంటుంది. సగటు సినిమా ప్రేక్షకుడు కోరుకునే అంశాలు అన్నీ ఉంటాయి. 'భద్ర', 'సింహ', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు భారీ విజయాలు సాధించాయంటే... బోయపాటికి మాస్ పల్స్ తెలియడమే. 'స్కంద'లోనూ ఆ మాస్ ఉంటుంది.'స్కంద' ప్రారంభమే ప్రేక్షకుడికి షాక్ ఇస్తుంది. క్లాష్ ఆఫ్ టైటాన్స్ అన్నట్లు స్క్రీన్ మీద పది నిమిషాలకు బోయపాటి శ్రీను భారీతనం కనబడుతుంది. రామ్ ఇంట్రో గానీ, ఆ తర్వాత సినిమాలో యాక్షన్ సీన్లు గానీ మాస్ జనాలను మెప్పిస్తాయి. ఆ యాక్షన్ దృశ్యాలకు తమన్ అందించిన నేపథ్య సంగీతం సైతం బావుంది. 'స్కంద' పతాక సన్నివేశాలకు ముందు వచ్చే ట్విస్ట్ మెప్పిస్తుంది. మాస్ యాక్షన్ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది.
సినిమాలో వెలితి... బోయపాటి గత సినిమాల్లో ఉన్నటువంటి బలమైన కథ, కథనాలు లేవు. లాజిక్స్ గురించి అసలు ఆలోచించవద్దు. ముఖ్యమంత్రి ఇంటికి హీరో ట్రాక్టర్ వేసుకుని ఎలా వెళ్ళాడు? యాక్షన్ సీన్లు అలా ఎలా తీశారు? వంటి ప్రశ్నలు అసలు అడగొద్దు. జస్ట్... స్క్రీన్ మీద బోయపాటి శ్రీను మేజిక్ ఎంజాయ్ చేయాలంతే! తెరపై రక్తం ఏరులై పారింది. తలలు తెగి పడ్డాయి. కొంత మంది ప్రేక్షకులకు అవి నచ్చకపోవచ్చు. తెరపై విధ్వంసాన్ని ఎంజాయ్ చేయలేకపోతే చాలా డిస్టర్బ్ అవుతారు. గతంలో బోయపాటి సినిమాల్లో చూసిన యాక్షన్ తరహాలో సినిమా ఉంటుంది.
రామ్ పోతినేని ని మాస్ హీరోగా ప్రజెంట్ చేయడంలో మాత్రం బోయపాటి శ్రీను సూపర్ సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. తమన్ నేపథ్య సంగీతం కమర్షియల్ శైలిలో ఉంది. పాటలు ఆశించిన రీతిలో లేవు. సినిమాటోగ్రఫీ సూపర్.
మాస్ యాక్షన్ సినిమాల్లో దర్శకుడు బోయపాటి శ్రీను యాక్షన్ సినిమాలు వేరు. యాక్షన్ సీక్వెన్సులు తీయడంలో ఆయనకు ఓ స్టైల్ ఉంటుంది. 'స్కంద'లోనూ ఆయన స్టైల్ యాక్షన్ ఉంది. కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆశించిన రీతిలో బలంగా లేవు. యాక్షన్ ఉన్నంత బలంగా ఎమోషన్స్ లేవు. రామ్ యాక్టింగ్, ఆ ఫైట్స్ ఆకట్టుకుంటాయి. మామూలు యాక్షన్ కాదు... బీభత్సమైన మాస్ యాక్షన్ ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు పండగ! వాళ్ళకు మాత్రమే ఈ సినిమా!🎥🎞️