top of page

'టిల్లు స్క్వేర్' మూవీ రివ్యూ🎥✨

సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లుతో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. టిల్లు గాడి వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజం అంతా కూడా కుర్రాళ్లకు బాగానే ఎక్కేసింది. అందుకే ఆ టిల్లు గాడి చుట్టూ మరో కథను అల్లుకుని టిల్లు స్క్వేర్ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమాలో అనుపమ కనిపించిన తీరుకు అంతా ఆశ్చర్యపోయారు. మరి అనుపమ తీసుకున్న ఈ నిర్ణయం, సిద్దు జొన్నలగడ్డ చేసిన మరో ప్రయత్నం వర్కౌట్ అయిందా? లేదా? అన్నది చూద్దాం.

ఒకసారి జరిగిన మ్యాజిక్ ని మళ్ళీ రీ క్రియేట్ చేయడం అంత తేలికైన విషయం కాదు. అందుకే 'డీజే టిల్లు' సీక్వెల్ అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ ఆ మ్యాజిక్ క్రియేట్ అవ్వడం సాధ్యమేనా? అనే అనుమానం వ్యక్తమైంది. మూవీ టీం మీద కూడా ఆ ఒత్తిడి పడింది. అందుకే రీ రైట్ లు, రీ షూట్ లు అంటూ కాస్త ఎక్కువ సమయమే తీసుకుంది. అయితే వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందనే చెప్పవచ్చు. ఆ మ్యాజిక్ ని మళ్ళీ రీ క్రియేట్ చేయగలిగారు.

గత కొన్నేళ్లలో ప్రేక్షకులకు బాగా చేరువైన పాత్రల్లో 'డీజే టిల్లు' ఒకటి అనడంలో సందేహం లేదు. టిల్లు చేష్టలు, మాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని టిల్లు పాత్ర నుంచి ప్రేక్షకులు ఎలాంటి వినోదం ఆశిస్తారో.. ఆ వినోదాన్ని అందించడంలో మూవీ టీం సక్సెస్ అయింది. 

కథగా చూసుకుంటే 'టిల్లు స్క్వేర్'లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇది ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా. 'డీజే టిల్లు' తరహాలోనే హీరో క్యారెక్టరైజేషన్ ప్రధానంగానే సినిమా సాగుతుంది. టిల్లు పాత్ర పరిచయం, టిల్లు-లిల్లీ ప్రేమ కథ, అక్కడక్కడా 'డీజే టిల్లు' రిఫరెన్స్ లు వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ మెప్పించింది. ఈసారి టిల్లు ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కోబోతున్నాడు అనే ఆసక్తిని కలిగిస్తూ ఫస్టాఫ్ ని ముగించారు.

'డీజే టిల్లు' సినిమాలో ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కాస్త కామెడీ డోస్ తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దానిని దృష్టిలో పెట్టుకొని ఈసారి చిత్ర బృందం సెకండాఫ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ఫస్టాఫ్ లో అక్కడక్కడా మాత్రమే నవ్వుకునే ఆడియన్స్.. సెకండాఫ్ లో ఎక్కువసార్లు నవ్వుకుంటారు. టిల్లు వన్ లైనర్స్, టిల్లు-లిల్లీ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కాసేపు హాయిగా నవ్వుకున్నామనే ఫీలింగ్ ని ఆడియన్స్ లో కలిగించడంలో చిత్ర బృందం విజయం సాధించింది. అయితే కొన్ని కొన్ని సన్నివేశాలు, 'డీజే టిల్లు' రిఫరెన్స్ లు మరీ ఎక్కువయ్యాయనే అభిప్రాయం కలుగుతుంది. 

సిద్ధు జొన్నలగడ్డ సంభాషణలు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఆ సంభాషణలే థియేటర్లలో నవ్వులు పూయించాయి. 'డీజే టిల్లు' విమల్‌కృష్ణ దర్శకుడు కాగా, సీక్వెల్ కి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించాడు. దర్శకుడు మారిన ప్రభావం 'టిల్లు స్క్వేర్'పై పడలేదు. టిల్లు పాత్రలోని ఆత్మను పట్టుకొని ప్రేక్షకులను అలరించడంలో మల్లిక్ రామ్ సక్సెస్ అయ్యాడు.

సాంకేతికంగా 'టిల్లు స్క్వేర్' ఉన్నతంగా ఉంది. రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరపరిచిన పాటలు బాగున్నాయి. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు కెమెరా పనితనం మెప్పించింది. నవీన్ నూలి ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.స్టోరీ, స్క్రీన్ ప్లే, లాజిక్స్ పట్టించుకోకుండా కాసేపు హాయిగా నవ్వుకోవాలి అనుకున్నవాళ్ళు ఈ సినిమాకి హ్యాపీగా వెళ్లొచ్చు. 'డీజే టిల్లు' సినిమాని నచ్చిన వారు.. దానికి సీక్వెల్ గా వచ్చిన 'టిల్లు స్క్వేర్'ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.🎥✨


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page