ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు వచ్చాక.. బయటి ఆహారం తినే వారి సంఖ్య బాగా పెరిగింది. వండుకునే ఓపికలేకనో.. లేదంటే.. రెస్టారెంట్ ఫుడ్ తినాలనే కోరిక.. ఏదైనా కావచ్చు.. కానీ నేటి కాలంలో బయటి ఆహారం తీసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇంట్లో.. ఎంతో శుభ్రంగా.. రుచిగా చేసినా సరే.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారు ఎక్కువగానే ఉన్నారు. పైగా కొన్ని రెస్టారెంట్లు అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఫుడ్ డెలివరీ చేస్తుండటంతో.. ఎప్పుడు.. ఏం తినాలనిపిస్తే.. అది ఆర్డర్ చేసుకుని చక్కగా లాగించేస్తున్నారు. ఇలా బయటి ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారిలో చాలా మంది పెద్ద పెద్ద, పేరు మోసిన రెస్టారెంట్లకే తొలి ప్రాధాన్యత ఇస్తారు. పది రూపాయలు ఎక్కువైనా.. నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందిస్తారనే నమ్మకంతో పేరు మోసిన రెస్టారెంట్లకే ప్రాధాన్యత ఇస్తారు.
మరి నిజంగానే ఆయా రెస్టారెంట్లు, హోటల్స్ తమ కస్టమర్లకు కల్తీ లేని.. నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాయా.. అంటే అస్సలు కాదని.. తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన సోదాలు వెల్లడిస్తున్నాయి. కుళ్లిపోయిన మాంసం, ఎక్స్‌పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక.. ఎంతో అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన అన్నీ రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ క్రమంలో ప్రముఖ తెలుగు కంటెంట్ క్రియేటర్ తెలుగు స్క్రైబ్.. కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం అందిస్తోన్న రెస్టారెంట్ల పేర్లతో కూడిన ఓ జాబితా విడుదల చేసింది. దీనిలో కృతుంగ, షా గౌస్, కామత్ వంటి దిగ్గజ రెస్టారెంట్లు, హోటల్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ ప్రకారం ఈ కథనం అందిస్తున్నాము. అలానే కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ, తెలంగాణ వారు తమ ట్విట్టర్ ఖాతాలో ఏఏ రెస్టారెంట్లు, హెటల్స్‌లో ఏ తేదీల్లో సోదాలు నిర్వహించారు.. అక్కడ ఎలాంటి కల్తీ జరుగుతుందో వివరించే ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ లిస్ట్ మీకోసం..
రాయలసీమ రుచులు..
కాస్త స్పైసీ ఫుడ్ కోరుకునే వారి మొదటి చాయిస్ రాయలసీమ రుచులు. ఇక తాజాగా ఈ నెల 18న అనగా శనివారం నాడు ఫుడ్ సెఫ్టీ అధికారులు రాయలసీమ రుచులు రెస్టారెంట్‌లో సోదాలు నిర్వహించారు. ఇక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రెస్టారెంట్‌లో పురుగులు పట్టిన మైదా పిండి, చింతపండు, ఎక్స్‌పైరీ తేదీ ముగిసిన పాలను వాడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాక రెస్టారెంట్ కిచెన్ ఏమాత్రం నీట్‌గా లేదని తెలిపారు.
షా గౌస్..
ఫుడ్ సెఫ్టీ అధికారులు శనివారం నాడు అనగా మే 18న షా గౌస్‌లో సోదాలు నిర్వహించారు. ఇక్కడ పూర్తిగా నాణ్యత లేని పదార్థాలు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పైగా రెస్టారెంట్ లోపల కనీస శుచి, శుభ్రత పాటించలేదని.. నీరు నిల్వ ఉందని.. ఎప్పుడు తయారు చేశారు.. ఎప్పటి వరకు వినియోగించే వివరాలు తెలిపే లేబుల్స్ లేని వండిన ఆహారాన్ని స్టోరేజ్‌లో భద్రపరిచినట్లు గుర్తించారు.
కామత్ హోటల్..
భాగ్యనరంలో ఎప్పటి నుంచో ఉండి.. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన కామత్ హోటల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎలాంటి లేబుల్ లేని టీ పౌడర్, నూడుల్స్‌ను సీజ్ చేశారు. వీటి విలువ 25 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇక ఫుడ్ తయారు చేసే వారు.. ఎలాంటి శుభ్రత పాటించడం లేదని.. తలకు క్యాప్‌లు, చేతులకు గ్లౌజ్‌లు ధరించలేదని వెల్లడించారు.
కృతుంగ..
హైదరబాద్‌లోని మరో ప్రముఖ రెస్టారెంట్ కృతుంగ. ఇక్కడ ఫుడ్ సెఫ్టీ అధికారులు సోమవారం నాడు సోదాలు నిర్వహించారు. ఎక్స్‌పైరీ దాటిన మేతీ మలాయ్ పేస్ట్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాక ఎక్స్‌పైరీ తేదీ వివరాలు వెల్లడించే లేబుల్స్ లేని పనీర్, నాన్ వెజ్ పేస్ట్‌ని, సిట్రిక్ యాసిడ్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వాటిని ధ్వంసం చేశారు. కిచెన్ లోపల కూడా శుభ్రంగా లేదని.. పని చేసేవారు తలకు మాస్క్‌లు వేసుకోలేదని.. చేతులకు గ్లౌజ్‌లు కూడా ధరించలేదని అధికారులు వెల్లడించారు.
కేఎఫ్‌సీ..
అలానే కేఎఫ్‌సీలో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. బుధవారం అనగా మే 21 నాడు ఫుడ్ సెఫ్టీ అధికారులు రైడ్ చేశారు. ఇక రెస్టారెంట్ లోపల ఎక్కడ కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఒరిజినల్ లైసెన్స్ కనిపించలేదని.. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నారని తెలిపారు.