top of page
Suresh D

వైఎస్ జగన్ పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు🗳️✨


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చిన జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదని, అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అంటూ వైయస్ షర్మిల ప్రజలను ప్రశ్నించారు. 

ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల జగన్ ఏరోజైనా ప్రజల సమస్యలను విన్నారా అంటూ ప్రశ్నించారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకుని అందులో ఉండే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ కు, వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల పేర్కొన్నారు. వైయస్సార్ హయాంలో ప్రజాదర్బార్ ఉండేదని, ఆయన వారసుడి పాలనలో ప్రజా దర్బార్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 127 చెరువులకు నీరు ఇస్తామని చెప్పారని గుర్తుచేసి, కానీ ఆయన అధికారంలోకి వచ్చాక చేసింది శూన్యం అంటూ విమర్శించారు. జగన్ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకు వస్తాను అన్నాడని, కానీ ఒక్క పరిశ్రమ కూడా తీసుకు రాలేదన్నారు. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్ ప్రత్యేక హోదా హామీని మరిచిపోయారని షర్మిల విమర్శించారు. ఏపీలో నిరుద్యోగుల పరిస్థితి చెప్పనవసరం లేదన్నారు. జగన్ వారికి ఉద్యోగ భద్రత కల్పించలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని లాంటిదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే వేలాది పరిశ్రమలు వచ్చేవని, జనాలకు ఉపాధి ఉండేదన్నారు. బిజెపి ఏపీ ప్రజలను మోసం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. 🗳️


bottom of page