top of page
MediaFx

బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం..


పశ్చిమ బెంగాల్‌ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. గవర్నర్‌పై తమకు ఫిర్యాదు అందిందని డీసీ (సెంట్రల్) ఇందిరా ముఖర్జీ గురువారం పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న ఓ మహిళ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు గురువారం పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. ‘‘ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. లైంగిక వేధింపులు ఎప్పుడు వెలుగు చూశాయనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఫిర్యాదు ప్రకారం, రాజ్‌భవన్‌లోనే ఇది జరిగింది. పలు మార్లు లైంగిక వేధింపులకు గురైనట్టు మహిళ ఫిర్యాదు చేసింది’’  అని ఆమె పేర్కొన్నారు. ఇంతకు మించి వివరాలు వెల్లడించేందకు నిరాకరించారు.  ‘‘రాజ్‌భవన్‌లో లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనలాగా అనేక మంది బాధితులు ఉన్నారని ఆ మహిళ ఆరోపిస్తోంది. మహిళల గౌరవమర్యాదలపై మోదీ, షాలకు నిజంగా నమ్మకం ఉంటే వెంటనే బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మరోవైపు, ఈ ఆరోపణలను బెంగాల్ గవర్నర్ కొట్టిపారేశారు. అవన్నీ తప్పుడు ఆరోపణలనీ, తన పరువుకు భంగం కలిగించేందుకు ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘అంతిమ విజయం నిజానిదే. ఇలాంటి కల్పిత ఆరోపణలకు నేను భయపడేది లేదు. నా పరువు తీసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ, బెంగాల్‌లో అవినీతి, హింసపై నా పోరాటాన్ని వారు ఆపలేరు’’ అని సీవీ ఆనంద బోస్ అన్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ సిబ్బందిని ఉద్దేశిస్తూ ఓ ప్రకటన చేశారు. అంతకుముందు రాజ్‌భవన్ సిబ్బంది ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయనపై ఆరోపణలను ఖండిస్తూ సంఘీభావం తెలిపారు.


bottom of page