top of page
MediaFx

రెండో దశలో పెరిగిన దూరం.. కోకాపేట వరకు మెట్రో రైలు


తెలంగాణా ప్రభుత్వం మెట్రో రైలు మార్గాన్ని పొడిగించే పనులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. తాజాగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్‌ ప్రసంగంలో ఈ విషయాన్ని తెలిపారు. రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ వరకు 8 కి.మీ. మార్గాన్ని ముందు ప్రతిపాదించారు. దీన్ని కోకాపేటలోని నియోపోలిస్‌ వరకు విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో ఇక్కడ 3.3 కి.మీ.పైగా పెరిగింది. ఈ కారణంగా అంచనాలు పెరిగాయి. మెట్రో డిపో కూడా ఇక్కడే ఏర్పాటు చేసేందుకు అనువైన భూముల కోసం అధికారులు కొద్దిరోజుల కిందట పరిశీలించారు. ఇక నాగోల్‌, ఎల్బీనగర్, జల్‌పల్లి మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ముందుగా 29 కి.మీ.గా ఎయిర్‌పోర్ట్‌ మెట్రోని అంచనా వేశారు. ఇది కాస్త 4 కి.మీ.కుపైగా పెరిగింది. ఇదే కారిడార్‌లో మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్, కొత్త హైకోర్టు వరకు 5 కి.మీ.పైగా మెట్రో మార్గం కూడా రెండోదశలో ప్రతిపాదించారు. దీంతో మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. అంచనా వ్యయం పెరిగి రూ.24,042 కోట్లకు చేరింది. నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్టలను మెట్రో ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు.

bottom of page