top of page
MediaFx

లైంగిక వేధింపుల ఆరోపణలు.. నటుడు జయసూర్యపై రెండో కేసు నమోదు


మాలీవుడ్‌ (Mollywood) సినీ పరిశ్రమలోని జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక (Hema Committee report) అలజడి సృష్టిస్తున్నది. కమిటీ ఇచ్చిన నివేదికలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు నటీమణులు తాము క్యాస్టింగ్‌ కౌచ్‌ బారినపడ్డామని, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. కమిటీ నివేదిక బయటపెట్టిన తర్వాత పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపులను బ‌య‌ట‌పెడుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో (Metoo Row) ఇప్పటి వరకు పలువురు సినీ తారలు, నిర్మాతలు సహా 17 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ వేధింపుల వ్యవహారంలో నటుడు జయసూర్య (Jayasurya )పై తాజాగా రెండో కేసు నమోదైంది. ఆయనపై 354, 354A(A1)(I), 354D ఐపీసీ సెక్షన్ల కింద రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నటి మిను మునీర్ నుంచి పూర్తి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తరువాత తిరువనంతపురంలో రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తరువాత కేసును తోడుపుజ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు.

జస్టిస్ కే హేమ కమిటీ రిపోర్ట్‌ బయటపెట్టాక మహిళ నటీమణుల ఆరోపణల నేపథ్యంలో కేర‌ళ‌లోని అధికార పార్టీ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్‌ సహా జయసూర్య, సిద్ధిఖీ, మణియం పిళ్ల రాజు తదితర మలయాళ సినీ ప్రముఖులపై పోలీసులు కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. శుక్రవారం జయసూర్యపై మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

bottom of page