మెగాటోర్నీ గెలువడంలో అప్పటి చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, బోర్డు కార్యదర్శి జై షా ముగ్గురు మూడు పిల్లర్ల వలే వ్యవహరించారని పేర్కొన్నాడు. ఈ ముగ్గురి వల్లనే ఐసీసీ ట్రోఫీ కల సాకారమైందన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న రోహిత్ మాట్లాడుతూ ‘గణాంకాలు, ఫలితాల గురించి పెద్దగా ఆలోచించలేదు. అతిగా ఆలోచించకుండా ఎవరి పాత్ర వారు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకున్నాం.
ఇందుకు జైషా, ద్రవిడ్, అగార్కర్ నుంచి నాకు పూర్తి సహకారం లభించింది. దీనికి తోడు ప్లేయర్లందరూ సమిష్టిగా రాణించడం కలిసివచ్చింది. దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ కల నెరవేరలేదన్న బాధ ప్రతీరోజు వేధిస్తుండేది. కానీ ప్రపంచకప్ గెలిచిన తర్వాత ప్రతీ సందర్భాన్ని ఆస్వాదించాలనుకున్నాం. అందుకు తగ్గట్లు దేశం మొత్తం సంబురాల్లో భాగం కావడం జీవితంలో మరిచిపోలేనిది.
అది మాటల్లో వర్ణించలేము. బ్యాట్ల ఎంపిక విషయంలో నేను పెద్దగా ఆలోచించను. బాగుందనుకుంటే ఆడేస్తాను. విజయం రుచి తెలిసిన తర్వాత దాన్నుంచి బయటపడలేం. రానున్న రోజుల్లో కీలకమైన సిరీస్‌ల్లో ఆడాల్సి ఉంది’ అని అన్నాడు. ఇదిలా ఉంటే కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, షమీ, ద్రవిడ్, హర్మన్‌ప్రీత్‌కౌర్, దీప్తిశర్మ అవార్డులు అందుకున్నారు.