top of page
MediaFx

జులై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు.. ప్రధాని హోదాలో తొలిసారి బరిలోకి రిషి సునాక్

సార్వత్రిక ఎన్నికల తేదీలపై జరుగుతున్న ప్రచారానికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ ముగింపు పలికారు. జులై 4న దేశంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సునాక్ ప్రకటించారు. దీనికి అనుగుణంగా త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తన అధికారిక నివాసం ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’ నుంచి ప్రసంగించిన ప్రధాని.. యూకే ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకునే సమయం వచ్చిందని అన్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా తన హయాంలో సాధించిన విజయాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశ ప్రజల రక్షణ కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వాగ్దానం చేశారు. దేశాధినేత కింగ్ చార్లెస్ IIIతో మాట్లాడానని, పార్లమెంటును రద్దు చేయమని అభ్యర్థించానని చెప్పారు. ఇందుకు రాజు అనుమతించడంతో జులై 4న ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు.ప్రధాని హోదాలో తొలిసారి బరిలోకి దిగుతున్న రిషి సునాక్‌కు రాబోయే ఎన్నికలు అగ్ని పరీక్షలాంటివే. అక్టోబరు 2022న బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన సునాక్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, విపక్ష లేబర్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అత్యధిక ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. దీంతో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

bottom of page